ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరుగుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులు ఎన్నో లెక్కలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులు అక్షరాల రూ.4,42,442 కోట్లు ఉందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అయితే ఈ అప్పులు 2019తో పోలిస్తే రెండింతలు పెరిగిందని కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు. ‘2019లో ఏపీ అప్పులు రూ.2,64, 451 కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671 కోట్లుగా ఉంది. అదే 2021 సంవత్సరానికి వచ్చేసరికి రూ.3,53,021 కోట్లుగా అప్పులు ఉన్నాయి. 2022 సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లకు ఏపీ అప్పులు చేరాయి. ఇక 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. ఏడాదికి సుమారు రూ.45 వేల కోట్ల అప్పులు ఏపీ ప్రభుత్వం చేస్తోంది’ అని కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు.
ఈ లెక్కలను పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం ఏడాదికి చేస్తున్న అప్పు దాదాపు రూ.45 వేల కోట్లకు పైగా ఉన్నాయి. అప్పు చేయనిది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. అప్పుల భారం పెరిగిపోవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ లెక్కలను పరిశీలించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ కు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కూడా జగన్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తోంది.