అమెరికాలో జరిగిన తుపాకీ మిస్ ఫైర్ జరిగిన ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు తన తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో పొరపాటున రివాల్వర్ ను తాకడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి తలలోకి బుల్లెట్టు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే అతడు కన్నుమూశాడు. ఈ ఘటనతో మధిర పట్టణంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్ సాయి (22) అమెరికాలోని అలబామ నగరంలో ఎంఎస్ చదివేందుకు 13 నెలల కిందట వెళ్లాడు. అక్కడి అబర్న్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తూనే స్థానికంగా ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. యథావిధిగా సోమవారం రాత్రి గ్యాస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యాడు. స్టేషన్ లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో అది మిస్ ఫైర్ జరిగి అఖిల్ సాయి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే అఖిల్ సాయి మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో మధురలోని కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని రోజుల్లో అఖిల్ సాయి మృతదేహం స్వదేశం రానుంది.