»Brs Mlc Padi Kaushik Reddy Inquiry Completed With National Commission For Women
NCW: ముగిసిన కౌశిక్ రెడ్డి విచారణ.. తెలంగాణలో ఆ ‘పదం’ కామన్
బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాత్రం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవహారంలో వాస్తవమే కౌశిక్ రెడ్డి మాట్లాడాడని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించదని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan)పై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women- NCW) ముందు విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో.. ఆ వ్యాఖ్యల సందర్భం వంటివి కౌశిక్ వివరించాడు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల మాదిరి రెండు రాజ్యాంగ సంస్థల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలు వచ్చాయి. సమావేశాలకు నిర్వహణకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి ఇవ్వకపోవడంతో మరింత వివాదం ముదిరింది. ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే కౌశిక్ రెడ్డి కూడా గవర్నర్ పై విమర్శలు చేశాడు. అయితే ఒకడుగు ముందుకు వేసి గవర్నర్ పై అసభ్యంగా మాట్లాడాడు. ‘అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుల ఫైళ్లను గవర్నర్ తన వద్ద పెట్టుకున్నారు. ఒక్క ఫైల్ ను కూడా కదలనివ్వడం లేదు’ అంటూనే గవర్నర్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ విమర్శలు చేశాడు.
అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను కమిషన్ సుమోటో (Suo moto Notice)గా తీసుకుంది. దీంతో విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కౌశిక్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యాడు. తాను చేసిన వ్యాఖ్యలను కౌశిక్ రెడ్డి సమర్ధించుకున్నాడు. తాను చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో సర్వసాధారణమని లిఖితపూర్వకంగా కౌశిక్ రెడ్డి తెలిపాడు. ఈ సందర్భంగా పలు సామెతలను ఉదాహరించాడు. తెలంగాణ మాండలికంలో అది సర్వసాధారణ పదమని లేఖలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాడు. కౌశిక్ వివరణతో కమిషన్ సంతృప్తి చెందిందని సమాచారం. విచారణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలా? లేదా అనేది కమిషన్ చర్చించనుంది. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయకపోవడంతో కౌశిక్ రెడ్డిని ఈసారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని తెలుస్తున్నది. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం కమిషన్ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
ఎంపీ అరవింద్ పై స్పందించరేం?
కాగా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాత్రం కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవహారంలో వాస్తవమే కౌశిక్ రెడ్డి మాట్లాడాడని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించదని ప్రశ్నిస్తున్నారు. కమిషన్ రాజకీయాలను పక్కన పెట్టి మహిళల సమస్యలపై దృష్టి సారించాలని నాయకులు హితవు పలికారు.