మాజీ మంత్రి భూమా అఖిలప్రియ షాకింగ్ న్యూస్ ఎదురైంది. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి అంశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఆమెను అదుపులోకి తీసుకుని నంద్యాల పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతోపాటు ఆమె అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోన్న వేళ- ఆ పార్టీలో వర్గ విభేదాలు రేకెత్తాయి. ఒక్కసారిగా బయటపడ్డాయి. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు పరస్పరం దాడులకు దిగారు. నడిరోడ్డు మీద కొట్టుకున్నారు.
ఈ దాడులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ అడుగుపెట్టనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో కొత్తపల్లికి చేరుకున్నారు. నారా లోకేష్ ముందు బల ప్రదర్శనకు దిగారు. తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. మధ్య తొలుత మాటలయుద్ధం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీదే వారు ఘాటు పదాలతో రెచ్చిపోయారు. పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో భూమా అఖిలప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు. ఏవీ సుబ్బారెడ్డిని చుట్టుముట్టి రక్తం కారేలా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. ఆయనను రోడ్డు మీదికి తోసిపడేశారు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది. ఆయనను కొడుతున్నప్పుడు భూమా అఖిల ప్రియా అక్కడే ఉన్నారు.
ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులను బెదిరించడం కనిపించింది. వారిపై ఘాటు పదాలతో విరుచుకుపడ్డారామె. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో తన తరువాతే ఇంకెవరైనా అంటూ హెచ్చరించారు. భూమా వర్గీయులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ..వారు ఏ మాత్రం లెక్కచేయలేదు. ఏవీ వర్గీయులను తరిమి కొట్టారు. నోటి నుంచి రక్తం కారుతున్న స్థితిలో కనిపించిన ఏవీ సుబ్బారెడ్డిని ఆయన వర్గీయులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల డీఎస్పీ సీ మహేశ్వర్ రెడ్డి.. ఆసుపత్రికి వెళ్లి ఏవీ సుబ్బారెడ్డిని పరామర్శించారు.