బీజేపీ ఎంపీ హరిద్వార్ దూబే(74)(Hardwar Dubey) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ప్రన్షు దూబే ధృవీకరించారు. తన తండ్రి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. ఎంపీ హరిద్వార్ దూబే మృతితో బీజేపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆకస్మాత్తుగా అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఆ క్రమంలో కొద్దిసేపటికే ఆయన చనిపోయారని తెలుస్తోంది.
2020లో బీజేపీ సీనియర్ నేత హరిద్వార్ దూబే రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు హరిద్వార్ దూబే ఉత్తరప్రదేశ్లోని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. హరిద్వార్ దూబే ఆగ్రా నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని శాసనసభ స్థానం ఆగ్రా కంటోన్మెంట్. హరిద్వార్ దూబే సంఘ్ పాత ప్రచారకులలో కీలక నేత. బీజేపీ క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు, అతను సీతాపూర్, అయోధ్య, షాజహాన్పూర్లలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారకర్తగా కూడా ఉన్నారు. దూబే స్వస్థలం బల్లియా. 1969లో హరిద్వార్ దూబే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ సంస్థాగత మంత్రిగా ఆగ్రా వెళ్లారు. అప్పటి నుంచి అక్కడ రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో ఆగ్రా కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మళ్లీ గెలిచి కళ్యాణ్ సింగ్ క్యాబినెట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా చేశారు.