Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన ఇంటిలో తుదిశ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1972లో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ నారీమన్ తన పదవికి రాజీనామా చేశారు.
నారీమన్ కుమారుడు జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 నుంచి 2013 వరకు ఆయన సొలిసిటర్ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఫాలీ నారీమన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ది స్టేట్ ఆఫ్ నేషన్, గాడ్ సేవ్ ది హానబుల్ సుప్రీం కోర్ట్ వంటి పుస్తకాలను కూడా ఆయన రాశారు.