Uma Ramanan: తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో పాటలతో గుర్తింపు పొందిన నేపథ్య గాయని (Playback singer) ఉమా రమణన్ (Uma Ramanan) మృతి చెందారు. 72 ఏళ్ల ఉమా రమణన్ బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కోలివుడ్ పరిశ్రమకు చెందిన ఉమా రామణన్ 35 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన సుదీర్ఘ సినిమా ప్రయాణంలో ఎన్నో పాటలు పాడారు. సుమారు ఆరు వేలకు పైగా ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. వయోభారం, అనారోగ్యమే తన మృతికి కారణమని తెలుస్తుంది.
ఉమా రామణన్ కోలివుడ్ పరిశ్రమలతో ఎంతో మంది దిగ్గజాలతో పనిచేశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ, విద్యాసాగర్, ఎమ్ఎస్ విశ్వనాథన్, దేవా, మణిశర్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీ జైరాం, ఎస్పీ శైలజ, కేజే యేసుదాస్, ఏఆర్ రెహమాన్, ఉన్ని మీనన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేశారు. ఆమె పాటలు నాటి నుంచి నేటి వరకు ఎంతొ మంది శ్రోతలను అలరించాయి. ఉమా రామణన్ మరణవార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.