Biparjoy: దూసుకొస్తున్న బిపర్జాయ్ తుఫాను..67 రైళ్లు రద్దు
బిపర్జాయ్(Biparjoy) తుఫాను(storm) మరింత తీవ్రమై గుజరాత్‌లోని కచ్‌లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి వెల్లడించారు.
అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపర్జాయ్(Biparjoy)’ తుఫాను(storm) భారత తీర ప్రాంతాలపై తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. దీని ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయితో పాటు పలు నగరాల్లో వర్షం కురిసి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతోపాటు గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరప్రాంతాల్లో కూడా బలమైన గాలులు వీస్తున్నాయి. జామ్ నగర్, ముంబైలలో అలలు వస్తున్నాయి. తుపాను కారణంగా నాలుగు రోజుల పాటు బలమైన గాలులు వీస్తాయని వాతవారణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను వచ్చే కొద్దీ గాలి వేగం పెరుగుతుంది. దీంతో చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్, ఫోన్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిపర్జాయ్ తుఫాను దృష్ట్యా దాదాపు 67 రైళ్లను కూడా రైల్వేశాఖ రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో రైలు(train)లో ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే సమాచారం తెలుసుకున్న తర్వాతే స్టేషన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే ప్రయాణికులు బుక్ చేసుకున్న టిక్కెట్లకు గాను రద్దు చేయబడిన రైళ్ల జాబితాను పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో గాలుల వేగం గంటకు 70 కి.మీ. బుధవారం నుంచి వర్షం కూడా తీవ్రమవుతుందని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. గురువారం మధ్యాహ్నానికి ‘బిపర్జాయ్’ తుపాను గుజరాత్‌లోని జఖౌ తీరాన్ని దానిని ఆనుకుని ఉన్న పాకిస్థాన్ తీరాలను తాకే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ సమయంలో గాలులు 135 km/h వేగంతో వీస్తాయి. ఇది 150 km/h వరకు పెరుగుతుంది. ఆ క్రమంలో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఇప్పటికే కచ్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇంకోవైపు ఈ తుపాను ప్రభావంపై ప్రధాని మోడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాలు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.