»Amberpet Clashes Between Mla Kaleru Venkatesh And Corporater Dusari Lavanya Srinivas Goud
Amberpet ఈ రోజు నుంచి చూపిస్తా.. నీ వల్ల కాదు: ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఘర్షణ
పరస్పరం మాటలు నువ్వెంత అనుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ‘ఈ రోజు నుంచి చూపిస్తా’ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగగా.. ‘నువ్వేం చేయలేవు.. నీతోటి కాదు’ అని కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశాడు. వెంటనే పోలీసులు ప్రవేశించి పరిస్థితిని చక్కదిద్దారు.
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ (BRS Party)లో అసంతృప్తులు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం ముగిసిందని అనుకునేలోపు హైదరాబాద్ (Hyderabad)లో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ నాయకుల మధ్య ఉన్న భేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్ పరస్పరం దాడులు చేసుకునే దాక పరిస్థితి చేరింది. దీంతో బీఆర్ఎస్ హైదరాబాద్ లో లుకలుకలు ఉన్నాయని.. ఇది భవిష్యత్ లో జరిగే ప్రమాదానికి ముందస్తు హెచ్చరికగా కనిపించింది.
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అంబర్ పేట (Amberpet) నియోజకవర్గంలో మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh), గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య (Dusari Lavanya), ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ (Dusari Srinivas Goud) హాజరయ్యారు. పూలే విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పరస్పరం తోసుకున్నారు. పరస్పరం మాటలు నువ్వెంత అనుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ‘ఈ రోజు నుంచి చూపిస్తా’ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగగా.. ‘నువ్వేం చేయలేవు.. నీతోటి కాదు’ అని కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశాడు. వెంటనే పోలీసులు ప్రవేశించి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా ఎమ్మెల్యేపై కార్పొరేటర్ దంపతులు అంబర్ పేట పోలీస్ స్టేషన్ (Amberpet Police)లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కార్పొరేటర్ లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్ నెట్టుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యే కొట్టాడు. కొంతకాలం నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో మమ్మల్ని ఆహ్వానించడం లేదు. మా డివిజన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించాడు’ అని తెలిపారు. ఈ ఘర్షణతో ఒక్కసారిగా అంబర్ పేటలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనపై పార్టీ అధిష్టానం వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. అయితే శ్రీనివాస్ గౌడ్ మంత్రి హరీశ్ రావు అనుచరుడిగా గుర్తింపు ఉండగా.. ఎమ్మెల్యే వెంకటేశ్ మంత్రి కేటీఆర్ వర్గంగా ప్రచారం ఉంది.