»Two Kolkata Girls Dishonouring National Anthem With Cigarette And Fir Filed Against Them
National Anthem సిగరెట్ తో జనగణమన పాడిన యువతులు
స్నేహితుడితో పందెం వేశామని అందులో భాగంగా అలా జాతీయ గీతం పాడినట్లు యువతులు చెప్పారు. ఎలా చేసినా అది తప్పే కావడంతో ఆ యువతులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మన జాతీయ గీతాన్ని (Jana Gana Mana Anthem) అవహేళనగా పాడిన.. ఆ పాటను విచ్చలవిడిగా వినియోగించినా చట్టరీత్యా శిక్షార్హులు. ఆ గీతాన్ని అత్యంత గౌరవంగా భావించాలి. అది మన ప్రాథమిక విధుల్లో ఒకటి. ఒకవేళ వాటికి విరుద్ధంగా ప్రవర్తించొద్దు. అలాంటి జాతీయ గీతాన్ని ఇద్దరు యువతులు సిగరెట్ తాగుతూ పాడారు. ఆ వీడియో వైరల్ కావడంతో పాటు తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal)లో జరిగింది.
కలకత్తాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు నవ్వుతూ.. కేరింతలు వేస్తూ చేతిలో సిగరెట్ పట్టుకుని జనగణమన గీతం ఆలపించారు. నిలబడి పద్ధతిగా ఆలపించాల్సిన జాతీయ గీతాన్ని అవమానించారు. జనగణమన పాడుతున్న వీడియోను ఫేస్ బుక్ (Facebook)లో పోస్టు చేశారు. ఆ వీడియోను చూసినవారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిగరెట్ (Cigarette) తాగడమే కాకుండా గీతాన్ని తప్పుగా పాడారు. ఈ వీడియోపై తీవ్ర దుమారం రేగింది.
ఈ వీడియోపై న్యాయవాది ఆత్రేయి హల్దర్ లాల్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువతులపై బరక్ పూర్ (Barrackpore) సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అనుపమ్ భట్టాచార్జి కూడా ఈ వీడియోను ఖండించారు. ఆ యువతుల వివరాలు కావాలని ట్విటర్ లో పోస్టు చేసింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. దీంతో యువతులు ఆ వీడియోను డిలీట్ చేశారు.
కాగా తాము ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. స్నేహితుడితో పందెం (Challenge) వేశామని అందులో భాగంగా అలా జాతీయ గీతం పాడినట్లు యువతులు చెప్పారు. ఎలా చేసినా అది తప్పే కావడంతో ఆ యువతులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దోషులుగా తేలితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, అది కాకుంటే రెండూ అనుభవించాల్సి ఉంటుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.