యువగళం (Yuvagalam Padayatra) పేరిట ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. రాయలసీమ (Rayalaseema) ప్రాంతంలో కొనసాగుతున్న ఈ యాత్రలో లోకేశ్ ఉత్సాహంగా అడుగులు వేస్తూ వెళ్తుండగా.. ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అయిన కూడా దృఢ సంకల్పంతో లోకేశ్ యాత్ర సాగిస్తున్నాడు. తాజాగా లోకేశ్ కు పోలీసులు నోటీసులు (Police Notice) జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఉలికుంటపల్లి గ్రామం వద్ద మంగళవారం 67వ రోజు తన పాదయాత్రను లోకేశ్ ప్రారంభించాడు. ఈ సమయంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య (DSP Chaitanya) వచ్చి లోకేశ్ కు నోటీసులు ఇచ్చేందకు ప్రయత్నించాడు. లోకేశ్ ఆ నోటీసులను తిరస్కరించాడు. ఆ నోటీసుల్లో ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి సామగ్రి పంపిణీ చేయొద్దు’ అంటూ అంది. చివరకు ఆ నోటీస్ ను టీడీపీ యాడికి మండల కన్వీనర్ రుద్రమనాయుడికి వెళ్లిపోయారు. నోటీసులు అందడంపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘67 రోజులుగా పాదయాత్ర చేస్తున్నా. ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానా?’ అని లోకేశ్ డీఎస్పీని ప్రశ్నించాడు. ప్రభుత్వ అవినీతి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అవినీతిని తాను కచ్చితంగా ఎండగడుతానని లోకేశ్ స్పష్టం చేశారు. కాగా పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వాగతించారు. అనంతరం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా లోకేశ్, టీడీపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.