నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, సర్వదర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31, జనవరి 1వ తేదిన భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు ప్రకటనలో పలు విషయాలను వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులందరికీ త్వరతిగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి సర్వదర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చూడండి: Vijayakanth: కెప్టెన్ మృతిని తట్టుకోలేకపోతున్నాను.. బోరుమన్న విశాల్
అలాగే సామూహిక అభిషేకాలు, బ్రేక్ టికెట్ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సినదిగా కోరారు. ఆర్జిత హోమాలు, అమ్మవారి కుంకుమార్చనలు యథావిధిగా ఉంటాయని, ఆర్జిత హోమాలు, కుంకుమార్చన టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటాయని శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు వెల్లడించారు.