ఇటీవల వరుస విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో విమాన ప్రయాణమంటేనే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. దీనికి తోడు విమానాల్లో ప్రయాణికులు నానా రభస సృష్టిస్తుండడంతో విమాన ప్రయాణాలు చేయలేని పరిస్థితి. తాజాగా మరో సంఘటన జరిగింది. ఆకాశంలో ఉండగానే ఓ విమానంలో మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. పైలెట్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ బీ737-800 విమానం శుక్రవారం కలికట్ కు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన వెంటనే విమానంలో మంటలు వచ్చాయి. విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఇంజన్ నంబర్-1లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందకు దించారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్ సురక్షితంగా విమానం దింపడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయాన్ని డీజీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి ఇది రెండో ప్రమాదం. జనవరి 23న తిరువనంతపురం నుంచి మస్కట్ కు వెళ్తున్న విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే.