ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రొంపిచర్లలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాల కోటిరెడ్డిపై కాల్పులు జరిగాయి. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఎవరో తెలియడం లేదు. రాజకీయ కక్షతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని తెలుస్తోంది. పోలీసులు అప్రమత్తమై నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఆలవాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డి. ప్రస్తుతం టీడీపీ రొంపిచర్ల మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే అతడిపై గతంలోనే కత్తితో దాడి జరిగింది. అప్పుడు ప్రాణాలతో బయటపడగా.. తాజాగా మరోసారి అతడిపై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు ప్రవేశించి కోటిరెడ్డపై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబసభ్యులు నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే అతడిపై కాల్పులు జరిపింది ఎవరో తెలియడం లేదు.
స్థానిక రాజకీయ ఘర్షణలే అతడిపై కాల్పులు జరగడానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా బాల కోటిరెడ్డిపై ప్రత్యర్థులు కక్షగట్టారు. అధికార పార్టీ వాళ్ల లేదా.. సొంత పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టారా అనేది తెలియడం లేదు. కొన్నాళ్లుగా రొంపిచర్లలో అతడిని హతమార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.