కడప పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి ఇద్దరు యువకులపై కత్తులతో కొందరు యువకులు దాడులకు పాల్పడ్డారు. కాపు కాచి మరీ ఇద్దరు స్నేహితులను హతమార్చారు. తీవ్ర గాయాలతో ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ సంఘటన కడపలో కలకలం రేపింది. డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కడపకు చెందిన రేవంత్ (27), అభిలాశ్ (29) స్నేహితులు. వీరిద్దరూ బుధవారం రాత్రి పట్టణంలోని సాయిబాబా థియేటర్ సమీపంలో రఘు బార్ కు వెళ్లారు. మద్యం సేవించి బార్ బయటకు వచ్చారు. అప్పటికే వారి కోసం కాపు కాస్తున్న నలుగురు యువకులు కత్తులతో ఎగబడ్డారు. విచక్షణా రహితంగా కత్తులతో పోట్లు పొడవడంతో రేవంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర రక్తపు మడుగులో పడి ఉన్న అభిలాశ్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు దారుణ హత్యకు గురవడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే కత్తులతో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి.. త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు.