బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురైన సంఘటనలోన దారుణమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎంపీని చంపిన తర్వాత చర్మం ఒలిచి, శరీర భాగాలను ముక్కలు చేసి వేరు వేరు చోట్ల పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Bangladesh MP murder : బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అనర్ హత్య కేసులో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీని హనీ ట్రాప్‌లోకి లాగి ఓ అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లి అక్కడ ఆయనను హత్య( murder) చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత ఆయనను గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మృత దేహాన్ని గుర్తు పట్టకుండా చేసేందుకు చర్మం ఒలిచి, శరీర భాగాలను ముక్కలు చేసి ఛిద్రం చేసినట్లు తెలుస్తోంది.
శరీర భాగాలు వాసన రాకుండా ఉండేందుకు వాటికి పసుపును పట్టించి ఉంచారు. వాటిని వేరు వేరు ప్రాంతాల్లో పడేయడానికి వీలుగా సంచుల్లో ఉంచారు. కొన్నింటిని ఫ్రిజ్‌లోనూ భద్ర పరిచారు. ఈ కేసు విషయంలో బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా కోల్‌కతాకు వచ్చిన అక్రమ వలసదారుడు(Illegal migrant) ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అన్వర్ చివరి సారి కనిపించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు.
ఎంపీకి పాత స్నేహితుడు, అమెరికాలో నివసించే ఓ వ్యక్తి టౌన్ హాల్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకున్నారు. అందులోకి ఓ మహిళ, ఇద్దరు పురుషులతో సహా ఆయన మే 12 తారీఖున లోపలికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. దీంతో ఎంపీని హనీ ట్రాప్ చేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నారు. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలు కావడం గమనార్హం. ఫ్లాట్‌లోకి తీసుకెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని బెంగాల్ సీఐడీ(CID) అధికారి ఒకరు వెల్లడించారు. చంపిన తర్వాత శరీర భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పడేసి ఉంటారని అందుకనే ఇప్పటి వరకు మృతదేహం లభ్యం కాలేదని తెలిపారు.