సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్ లను కాదని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యవహారం, నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నోరు విప్పారు.
‘కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు. బహిరంగంగా పార్టీ, సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం వేరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీగా ఇంకా ఎవరినీ నియమించలేదు. కొంతమంది ఎలా లాక్కోవాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు’ అని సజ్జల పేర్కొన్నారు. ఇదే విషయమై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా స్పందించారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు, ఆరోపణలను కొట్టి పారేశారు.