తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. లోకేశ్ బస చేసిన ప్రదేశానికి వచ్చి బీభత్సం సృష్టించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించేసి రచ్చ చేశారు. అనంతరం తెలుగు తమ్ముళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.
పాదయాత్రలో భాగంగా లోకేశ్ మంగళవారం పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లిలో పర్యటించారు. రాత్రి అక్కడే బస చేశారు. బస చేసిన ప్రదేశానికి వైసీపీ కార్యకర్తలు చేరుకుని టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేశారు. అనంతరం దాడికి తెగబడడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలను ఇంటికి పంపించేయడం గమనార్హం. వైసీపీ నాయకులను పోలీసులు ఒక్క మాట కూడా అనలేదు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికార వైసీపీ నేతలకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.