»A Total Of 28 Medical Colleges Will Be Set Up In Ap With Rs 8480 Crore Cm Jagan
AP: ఏపీలో మొత్తం 28 మెడికల్ కాలేజీలు..రూ.8,480 కోట్లతో ఏర్పాటు: సీఎం జగన్
ఏపీలో మొత్తం 28 కాలేజీలు ఏర్పాటు కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేడు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ (Cm Jagan) శుక్రవారం 5 మెడికల్ కాలేజీలను (Medical Colleges) ప్రారంభించారు. విజయనగరం గాజురేగలో 70 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీని ఆయన ప్రారంభించిన తర్వాత పలు విషయాలను వెల్లడించారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను కూడా సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 28 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
ప్రస్తుతం 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో 5 ప్రారంభిస్తామన్నారు. ఏపీలో మొత్తంగా 28 కాలేజీలో అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కాలేజీల ఏర్పాటు కోసం రూ.8,480 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తోందన్నారు. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇప్పటి వరకూ ఏపీలో 2185 సీట్లు ఉన్నాయని, 17 కాలేజీలు పూర్తయ్యాక ఎంబీబీఎస్ సీట్ల (MBBS seats) సంఖ్య 4735కు పెరగనున్నాయన్నారు. వచ్చే ఏడాది పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోనీ తదితర వెనకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను నిర్మించనున్నట్లు ఏపీ సీఎం జగన్ (Cm Jagan) వెల్లడించారు.