»3 Killed In Jcb Slipped On Car In Nizambad Bheemgal
Nizamabad వెళ్తున్న కారుపై పడిన జేసీబీ.. ముగ్గురు దుర్మరణం
సంఘటనపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవరికీ తోచడం లేదు. కారు ట్రాక్టర్ ను ఢీకొట్టిందా? లేదా ట్రాక్టర్ పై ఉన్న జేసీబీ జారిపడి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృత్యువు (Death) ఊహించని రూపంలో దూసుకొచ్చింది. కారులో సక్రమంగానే రోడ్డు వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఇతర వాహనంపై ఉన్న జేసీబీ (JCB) అదుపు తప్పి కారుపై పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో కారులోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకుని వెళ్తున్న వారిని జేసీబీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటన తెలంగాణ (Telangana)లోని నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మోర్తాడ్ (Mortad) మండలం దొన్కల్ (Donkal) గ్రామానికి చెందిన లక్ష్మీ తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం బడా భీమ్ గల్ ఎలమ్మ ఆలయానికి వెళ్లారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో ఏడుగురు బయల్దేరారు. అయితే రాత్రి భీమ్ గల్ (Bheemgal) పట్టణానికి చేరుకోగానే విద్యుత్ ఉప కేంద్రం వద్ద ట్రాక్టర్ పై జేసీబీని ఉంచి తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ఆ జేసీబీ ట్రాక్టర్ (Tractor) పై నుంచి జారిపడి లక్ష్మీ ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఊహించని సంఘటనతో వారు తప్పించుకోలేకపోయారు.
జేసీబీ ఒక్కసారిగా పడడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఆ కారులో ఉన్న ఏడుగురిలో లక్ష్మి కుమారుడు ముప్పారపు రాజేశ్వర్ (45), కోడలు జ్యోతి (42), కుమార్తె రమ (41) తీవ్ర గాయాలపాలై కారులోనే ప్రాణం విడిచారు. మిగతా నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. కాగా 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా గంట ఆలస్యంగా చేరుకుంది. బాధితులను నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. భార్యాభర్తలు రాజేశ్వర్, జ్యోతి మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. కాగా ఈ సంఘటనపై అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎవరికీ తోచడం లేదు. కారు ట్రాక్టర్ ను ఢీకొట్టిందా? లేదా ట్రాక్టర్ పై ఉన్న జేసీబీ జారిపడి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.