Republican primary elections : ప్రైమరీ ఎన్నికల్లో విజయం.. అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో జోరు మీదున్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ ఊపు మీదున్నారు. రెండు ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి దూసుకుపోతున్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ముందు పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అలా రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు రెండు చోట్ల నుంచి గెలుపు సాధించారు. గురువారం నెవాడాలో ఏకగ్రీవంగా విజయం సాధించగా వర్జిన్ ఐలాండ్స్‌లోనూ విజయం సాధించారు. వర్జిన్ ఐలాండ్స్‌లో ఏకంగా 73 శాతం ఓట్లు సాధించి ముందంజలో నిలిచారు. ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీకి కేవలం 26 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి.
ఈ ఫలితాలపై ట్రంప్ సైతం హర్షం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము గెలుస్తామని ముందే ఊహించామని అయితే ఇంత భారీగా గెలవడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఈ విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం నెవాడాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో(Republican Primary Polls) ట్రంప్‌కు పోటీ లేకుండా పోయింది. బరిలో ఉన్న నిక్కీ హేలీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన విజయం ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలను అతిక్రమిస్తున్నందుకు నిరసనగా తాను పోటీ నుంచి తప్పుకొన్నట్లు నిక్కీ హేలీ వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ఈ విజయంతో ట్రంప్‌కు 26 డెలిగెట్స్ లభించాయి. అధ్యక్ష అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలంటే 1,215 డెలిగెట్స్ రావాల్సి ఉంటుంది.