»1800 Scientists Letter To Ncert On Droping The Charles Darwin Theory Of Biological Evolution
Darwin సిద్ధాంతం తొలగింపు.. ఇవేమి పాఠాలంటూ Narendra Modiపై శాస్త్రవేత్తల ఆగ్రహం
తొలగించిన పాఠ్యాంశాన్ని యథావిధిగా పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ డిమాండ్ చేసింది. విద్యను కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు తొలగిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి తొలగిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
విద్యా వ్యవస్థలో (Education System) భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత పాలకు చరిత్రను తిరగరాసేస్తున్నారు. ఒక్క చరిత్రే కాదు జీవ, రసాయన, భౌతిక శాస్త్రాలతో పాటు భాష, రాజనీతి శాస్త్రం ఇలా అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల్లో మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులపై విద్యావేత్తలు (Educationalists), మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వీరి ఆందోళనకు శాస్త్రవేత్తలు (Scientists) కూడా తోడయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ చేస్తోందని, చరిత్రను వక్రీకరిస్తోందని శాస్త్రవేత్తలు మండిపడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పుస్తకంలో డార్విన్ (Charles Darwin) ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతాన్ని (Theory of Biological Evolution) తొలగించారు. మానవుడి పుట్టుకపై శాస్త్రీయంగా వివరించే ఈ సిద్ధాంతాన్ని తొలగించడంపై శాస్త్రవేత్తలు భగ్గుమన్నారు. దీనికి నిరసనగా ఏకంగా 1800 మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ (Letter) రాశారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ణానంపై అవగాహన కల్పిస్తూ.. మూఢ నమ్మకాలపై పోరాటం చేస్తున్న సంస్థ ‘బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ’ (Breakthrough Science Society- BSS). డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడంపై ఆ సొసైటీ ఆధ్వర్యంలో 1800 మందికి పైగా శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవ పరిణామ సిద్ధాంతం తొలగించడంపై ప్రఖ్యాత సంస్థలైన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తో పాటు వివిధ ఐఐటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఆ లేఖపై సంతకాలు చేశారు.
పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరిట విలువైన పాఠ్యాంశాలను ఎన్ సీఈఆర్ టీ (NCERT) తొలగిస్తోంది. దీనిలో భాగంగా పదో తరగతి సైన్స్ పుస్తకంలో ‘వారసత్వం- పరిణామం’ అనే పాఠ్యాంశం నుంచి ‘పరిణామం’ అనే భాగాన్ని తొలగించారు. వీటిలో పలు అంశాలతో పాటు డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ క్రమ సిద్ధాంతం కూడా ఉంది. శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ఈ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, సైన్స్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, మేధావులు ఈ చర్యను ఖండించారు.
విద్యపై కుట్ర: ఆర్ గంగాధర్, గంగాజీ
తొలగించిన పాఠ్యాంశాన్ని యథావిధిగా పాఠ్య పుస్తకాల్లో ఉంచాలని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ (BSS) తెలుగు రాష్ట్రాల చాప్టర్ ప్రతినిధులు ఆర్. గంగాధర్ (R Gangadhar), దేవార్షి గంగాజీ డిమాండ్ చేశారు. విద్యను కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన పాఠ్యాంశాలు తొలగిస్తున్నారని గంగాధర్ ఆరోపించారు. ఇలాంటివి తొలగిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సొసైటీ తెలంగాణ ఉపాధ్యక్షుడు గంగాజీ (Devarshi Gangaji) కూడా ఈ చర్యను తప్పుబట్టారు.