నంద్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి తమ పార్టీలోకి వస్తారని టీడీపీ నాయకురాలు, మాజీ భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలతో ఆయన టచ్లో ఉన్నారని తెలిపారు. అయితే అతడి అక్రమాలు ఈ నెల 4వ తేదీన ఆధారాలతో సహా బయటపెడతామని అఖిల హెచ్చరించింది. అక్రమాలను బహిర్గతం చేస్తాను.. శనివారం నంద్యాలలోని గాంధీ చౌక్ కు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికు అఖిల ప్రియ సవాల్ విసిరారు. అయితే ఆమెతో చర్చకు రాలేనని ఎమ్మెల్యే ప్రకటించాడు. ఆయన రాకున్నా తాను గాంధీ చౌక్ కు వెళ్తానని అఖిల స్పష్టం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె గాంధీ చౌక్ కు చేరుకుంటే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు.
తెల్లవారుజాము నుంచే అఖిలప్రియ ఇంటి ముందు భారీ బందోబస్తు చేపట్టారు. అఖిలప్రియ బయటకు రాకుండా పోలీసులు అడ్డంకిగా నిలబడ్డారు. ఆమెను గృహ నిర్బంధం చేశారు. అయితే అఖిలప్రియ చేసిన సవాల్ ను ఎమ్మెల్యే శిల్పా రవి మాత్రం స్వీకరించలేదు. ఆడవాళ్లతో కయ్యానికి దిగే సంస్కృతి తనది కాదని ఎమ్మెల్యే తెలిపాడు. తాను చర్చకు రాలేనని ప్రకటించాడు. అయినా కూడా అఖిలప్రియ గాంధీ చౌక్ కు సాయంత్రం 4 గంటలకు వెళ్తానని ప్రకటించడంతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వీడే ఆలోచనలో ఉన్నారు. ఆ క్రమంలోనే శిల్పా రవి కూడా టీడీపీలోకి వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన రాకను అఖిలప్రియ వ్యతిరేకిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని పార్టీలోకి ఎలా చేరుతారని అఖిలప్రియ వాదిస్తోంది. దీంతో నంద్యాల రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది.