ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అతడి కాన్వాయ్ లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారు అదుపు తప్పి అఖిలేశ్ కాన్వాయ్ లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా.. అఖిలేశ్ యాదవ్ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన యూపీలోని హర్దోయ్ జిల్లాలో జరిగింది.
హర్దోయ్ జిల్లాలో శుక్రవారం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పర్యటించారు. లక్నో నుంచి బయల్దేరగా కొన్ని నిమిషాల అనంతరం అతడి కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది. వేరే కారు అదుపు తప్పి అఖిలేశ్ కాన్వాయ్ లోని వాహనాలను ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ కొద్దిసేపు ఆగి ప్రమాదాన్ని పరిశీలించారు. గాయపడిన ముగ్గురిని అంబులెన్స్ లో తరలించారు. అనంతరం తన కార్యక్రమానికి వెళ్లారు. ‘ఓ కారు అదుపుతప్పి అఖిలేశ్ కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదంలో 7 కార్లు దెబ్బతిన్నాయి. ముగ్గురికి గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని హర్దోయ్ పోలీసులు తెలిపారు.
కాగా అఖిలేశ్ యాదవ్ ఈ నెల 17న తెలంగాణ పర్యటనకు రానున్నాడు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు అఖిలేశ్ హాజరు కానున్నాడు. కాగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ కేసీఆర్ వెన్నంటి ఉంటున్నాడు. ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా హాజరైన విషయం తెలిసిందే.