NLR: నెల్లూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కే.సురేశ్ రెడ్డిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం కలిశారు. జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయాధికారులతో డిస్ట్రిక్ కోర్టులో వర్క్ షాప్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలో న్యాయ పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
GNTR: అమరావతి కొత్త రైలు మార్గ పనులు ఎర్రుపాలెం నుంచి ప్రారంభమయ్యాయి. గుంటూరులో భూసేకరణ పెండింగ్‌లో ఉండటంతో, తొలుత ఎర్రుపాలెం-కొత్తపల్లి మధ్య 21.2 కి.మీ పనులకు రూ. 415.63 కోట్లతో రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. మొత్తం 57 కి.మీ ప్రాజెక్టును రూ. 2,245 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం. ఈ గడువులోగా పనులు ముగియాలంటే భూసేకరణను ప్రభుత్వం వేగవంతం చేయాల్సి ఉంది.
కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ (SCP) విభాగం ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం NSFDC, NSKFDC పథకాల కింద రుణాలు పొందిన SC ,ST లబ్ధిదారులకు వడ్డీ మాఫీ సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ శనివారం వెల్లడించారు. రుణగ్రహీతలు తమ బకాయి అసలు మొత్తాన్ని ఈ నెల 30 లోపు పూర్తిగా చెల్లించినట్లయితే వారి రుణ ఖాతాల్లో వడ్డీ మాఫీ అవుతుందన్నారు.
KRNL: జిల్లాలో ఆదివారం మాంసం ధరలు పెరిగాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం.. కేజీ చికెన్ (స్కిన్‌తో) రూ.220, స్కిన్ లెస్ రూ.251గా ఉంది. నాటుకోడి మాంసం రూ.700 కాగా, పొట్టేలు మాంసం ఏకంగా రూ.1000కి చేరింది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. సెలవు దినం కావడంతో మాంసం దుకాణాల వద్ద సందడి నెలకొంది.
E.G: నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరం సాధించడమే తమ లక్ష్యమని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం మార్గాని ఎస్టేట్స్ నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే మూడేళ్లలో పార్లమెంట్ పరిధిలోని 20 వేల మంది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన 500 మంది నిరుద్యోగులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు.
ATP: అనంతపుర అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడ) పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ ఆనంద్, అహుడ చైర్మన్ TC వరుణ్ కీలక సమావేశం నిర్వహించారు. నగరంలో పింక్ టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్, క్లాక్ టవర్, సప్తగిరి సర్కిల్ ఆధునీకరణపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి, నగర సుందరీకరణ కోసం చైర్మన్ చేసిన ప్రతిపాదనలకు కలెక్టర్ అంగీకారం తెలిపారు.
VZM: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులకు బొబ్బిలి CI కె. నారాయణరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. శనివారం రాత్రి స్దానిక ఇందిరమ్మ కాలనీలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా CI వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసు నమోదు చేస్తమని హెచ్చరించారు.
NDL: ఉయ్యాలవాడలో గంగ భవాని తిరుణాల సందర్భంగా ఈ నెల 30న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు వరుసగా వరుస బహుమతులుగా రూ.80,000 రూ.60,000, రూ.40,000, రూ.20,000 నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్థానికులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు.
NLR: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 212 మంది పోలీస్ సిబ్బంది బదిలీలను పారదర్శకంగా నిర్వహించినట్లు నెల్లూరు SP అజిత వేజెండ్ల శనివారం సాయంత్రం తెలిపారు. అన్ని విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరించి, సిబ్బంది అభ్యర్థనలు, అవసరాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రక్రియను చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
KKD: గంజాయి తాగిన, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు అన్నారు. శనివారం తుని మండలం టీ. తిమ్మాపురం గ్రామంలో ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశామన్నారు. ఈ దాడుల్లో గంజాయి తాగుతున్న ఓ వ్యక్తిని అదుపులో తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారని వెల్లడించారు.
ప్రకాశం: థాయిలాండ్‌లోని శ్రీరాచాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2026లో మార్కాపురం ఫిజికల్ డైరెక్టర్ డోలా శ్యామలాదేవి అద్భుత ప్రతిభ కనబరిచి ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని సాధించారు. మార్కాపురంలోని ZP బాలుర ఉన్నత పాఠశాలలో ఆమె PDగా పనిచేస్తున్నారు. ఆమె సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనియాడారు.
KRNL: మహిళల సాధికారత విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని, ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు రాజ కీయ నాటకాలు ఆడుతోందని విమర్శించారు.
సత్యసాయి: కొత్తచెరువులోని స్మశాన వాటికను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి అక్కడి పరిస్థితులను చూశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాలు, పరిశుభ్రతపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.
కడప: కానిస్టేబుల్‌ను బెదిరించిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన రౌడీషీటర్ అమ్మలదిన్నె సుధాకర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా అతనికి రిమాండ్ విధించారు. దీంతో సుధాకర్‌ను కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
VSP: సింహాచలం చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సోమవారం ఉదయం 3 గంటలకు తొలిదర్శనం, 3.30 నుంచి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. భక్తుల కోసం నీరు, మజ్జిగ, వైద్య శిబిరాలు, ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాహనాలకు పాస్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు.