SKLM: వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా దేశానికి మంచి జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రాంత కార్యకారిణి సభ్యుడు ఓలేటి సత్యనారాయణ అన్నారు. ఆదివారం రాత్రి శ్రీకాకుళం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో వైభవ భారతం కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమంలో డాక్టర్ అమ్మన్నాయుడు, పీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
KDP: పెన్నా నది వద్దకు వచ్చే పర్యాటకులకు వల్లూరు ఎస్సై శివ హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. నది బయటకు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ లోపల తీవ్ర ప్రమాదాలు దాగి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. సుడిగుండాలు, లోతైన నీటి ప్రాంతాలు కనిపించకపోయినా ప్రాణాంతకంగా మారే అవకాశముందని తెలిపారు. ఫోటోలు, వీడియోలు కోసం నదిలోకి దిగడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు.
ప్రకాశం: తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్యసంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బొట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబునాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగే బోటుల్లో ఉన్న పోలీసులకు తుపాకులు అందిస్తామన్నారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తిరుపతి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణ, అర్చకులు వారికి మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి రూ.45,000, అన్నదానానికి రూ.25,000 విరాళం అందజేసినట్లు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె తాలూకాలో బైక్ రేసర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం బైక్ రేసర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శనివారం స్థానిక జగన్ కాలనీలో నివసిస్తున్న మైనర్ బాలుడు దీక్షిత్‌ను బైక్ రేసర్లు ఢీకొట్టడంతో అతనికి కాలు విరిగిందన్నారు. గాయపడిన బాలుడు ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కర్నూల్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టనున్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి జిల్లా జైలులో ఈ నెల 10వ తేదీన వేరుశనగ చెక్కకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 75 వేల కిలోల వేరుశనగ చెక్క వేలం వేస్తామని, పాల్గొనేవారు రూ. 60వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా జైలులో సంప్రదించాలని వారు పేర్కొన్నారు.
BPT: సూర్యలంక బీచ్‌లో పర్యాటకులు ఎండకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు నీడనిచ్చే గొడుగులు, బల్లలను తొలగించడమే ఇందుకు కారణం. వేసవిలో వారాంతాల్లో వచ్చే వేలాది మంది నీడ లేక అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి గొడుగులు, బల్లలను తిరిగి ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
విశాఖ: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని సీఎండీ పేర్కొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెంకు చెందిన నాగసూరి మాధురికి నటసార్వభౌమ, మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి పురస్కారం లభించింది. ఏలూరులో టీడీపీ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ఇన్నర్ వీలు క్లబ్ ఆఫ్ JRG గోల్డ్ పూర్వ అధ్యక్షురాలుగా ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ పురస్కారానికి ఎంపిక చేశారు.
కోనసీమ: అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత పనులు చేయిస్తున్న సమయంలో గాయపడిన చప్పిడి మణికంఠ గాయాలు పాలైన విషయం తెలిసిందే. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మణికంఠను RSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం పరామర్శించారు. RSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కంటేపల్లి నరేంద్ర మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల చేత పాఠశాలలో పనులు చేయించడం సరికాదన్నారు.
NDL: గోస్పాడు మండలానికి ప్రభుత్వం స్వచ్ఛ రథం మంజూరు చేసినట్లు ఎంపీడీవో షేక్ అమానుల్లా ఒక ప్రకటన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ రథాన్ని అందించారని పేర్కొన్నారు. ఇది ప్రతి రోజు గ్రామాల్లో తిరిగి పొడి, తడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రజల నుంచి సేకరిస్తుందని వివరించారు.
కడప రిమ్స్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై నిమ్స్ చికిత్స పొందుతున్నారు.
KRNL: ఆదోని అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మునిసిపల్ కమిషనర్ నహిమ్ హమద్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన తనిఖీలలో టిఫిన్ రుచిగా ఉండాలని, చట్నీ పల్చగా ఉండకూడదని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపయోగించిన ప్లేట్లను వేడి నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.
అన్నమయ్య: చంద్రగిరి–నర్సింగాపురం మధ్య రైల్వే పట్టాలపై ఆదివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలానికి చెందిన షేక్ అస్లాం (20)గా గుర్తించారు. ఘటనపై చిత్తూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.