PPM: కొమరాడ మండలం కళ్లికోట గ్రామ సమీపంలోని నాగవళి నదీతీరంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులను ఇవ్వలేదు. అలాగే, అధికారికంగా ఇసుక ర్యాంపు కూడా లేదు. అయినా సరే రాత్రిపగలు తేడా లేకుండా ఇసుకను తవ్వుతున్నారు. ఒక్కోట్రాక్టర్ రూ.4వేల నుంచి రూ.5 వేలకు పట్టణాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.
AKP: ఉపాధి హామీ పథకాన్ని వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. రోజు తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే, కూలీల సంఖ్య తగ్గకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
VZM: జిల్లాలో మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్థల పరిశీలనకు సిద్ధమయ్యారు. భోగాపురం మండలంలో శుక్రవారం ఆయన పర్యటించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా రణస్థలం ప్రాంతంలో కూడా స్థల పరిశీలన చేయనున్నారు. కాగా వచ్చేనెల 27 నుంచి మహానాడు జరగనుంది.
అన్నమయ్య: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించకూడదని అన్నమయ్య జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ షేక్ జాబీర్, ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దశలవారీ పోరాటంలో భాగంగా రాయచోటి బాలికోన్నత పాఠశాల పదవ తరగతి మూల్యాంకన కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ASR: ఇంటి పన్నుల వసూళ్లలో ఉమ్మడి అల్లూరి జిల్లా రాష్టంలో ప్రథమంగా నిలిచిందని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ రావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 22 మండలాల్లో 430 గ్రామ పంచాయతీలు ఉండగా, 414 పంచాయతీలు 100 శాతం పన్నులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా అవినీతికి తావులేకుండా రూ.12.05కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు.
TPT: సూళ్లూరుపేట మండలం మన్నేముత్తేరిలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ పాస్టర్ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. విలువైన వస్తువులు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
CTR: తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగిస్తూ కర్నూలు ఉప లోకాయుక్త జస్టిస్ రజిని ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో 2024లో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు భర్తీ చేశారు. ఇందులో అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో ముగ్గురిని తొలగించారు.
KDP: మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో 4 మంది నిందితులకు తిరుపతి RSS స్పెషల్ JFCM కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు 2014లో నమోదవగా, నిందితులు ఎర్ర చందనం అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది.
KRNL: ఆదోనికి చెందిన బత్తిని కుబేర్ నాథ్‌ను జాతీయ బీసీ సంఘం జాతీయ కార్యదర్శిగా నియమిస్తూ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా కుబేర్ నాథ్ తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
NLR: ఏఎస్ పేట సమీపంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి ASపేటకు వస్తున్న కావేరీ బస్సును అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎమర్జెన్సీ డోర్ సైతం లేకపోవడంతో ఆత్మకూరు ఎంవీఐ ఎం.రాములు బస్సును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
KDP: చెన్నూరు(M) కనపర్తిలో చల్లా పౌలయ్య (70) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వరి కోత యంత్రం తగిలి చనిపోయాడని బంధువులు ఆరోపిస్తుండగా, ఎండకు పడిపోతే చేతిలోని కత్తి ఛాతీలో దిగి మరణించాడని డ్రైవర్ తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొడుకు ఫిర్యాదుతో పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఈ నెల 20న ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. ప్రజావేదికలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణదుర్గంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి రక్తదానం చేయాలని కోరారు.
VSP: హాస్య సామ్రాట్ చార్లీ చాప్లిన్ 137వ జయంతి వేడుకలను వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని విశాఖ పౌర గ్రంథాలయ హాలులో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో చాప్లిన్ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన జీవితంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు.
కృష్ణా: నాగాయలంక మండలం ఎదురుమొండిలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇవాళ శంకుస్థాపన చేశారు. APCPDCL ఇంప్రూవ్‌మెంట్ నిధులు రూ.4 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో కలసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
KRNL: పెద్దకడబూరులోని PHCలో ప్రజలకు ఉపయోగపడాల్సిన మందులను స్థానిక వైద్యులు తగలబెట్టేశారు. ఎక్స్‌పైరీ అయ్యాయనే సాకుతో వందలాది సిరప్‌లు, ట్యాబ్లెట్లు గురువారం రాత్రి ఎవరూ లేని సమయంలో కాల్చారు. స్టాక్‌ను ప్రజలకు పంపిణీ చేయకుండా ఇలా మంటల్లో పారవేయడంపై సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.