కోనసీమ: అమలాపురం మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారం తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ స్థల పురాణం చూసుకుంటే ఇక్కడ స్వామి వారు స్వయంభు వెలిశారని ప్రతీతి. ఈ స్వామి వారిని పూజిస్తే సర్ప దోషాలు, నాగ దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు.
గుంటూరులో మంగళవారం యాంటీ డ్రగ్స్ 2K వాక్ జరిగింది. యాంటీ డ్రగ్స్ ఫోరమ్ శంకర్ విలాస్ సెంటర్ నుంచి కొరిటెపాడు సెంటర్ వరకు ఈ వాక్ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా గంజాయి నిర్మూలన కోసం కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
CTR: పెద్దపంజాణి (M) శంకర్రాయలపేటలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి పంటను ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన రైతు మాడి శంకరప్ప రెండు ఎకరాల్లో మామిడి చెట్లు నాటాడు. మంచి కాయలు కాయడంతో కవర్లు సైతం కట్టించాడు. సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు తోటలోని కాయలను ధ్వంసం చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కృష్ణా: టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ను నిన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సుదీర్ఘ నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ దృక్పథాన్ని గుర్తించి అధిష్టానం ఈ బాధ్యత అప్పగించిందని అన్నారు.
VZM: కుంటినవలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డి. విరాస్వామిని సోమవారం సాయంత్రం పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
KKD: కాకినాడ (D) ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ధూళిపూడి ఇండస్ట్రీ, మెడిప్లస్ వంటి సంస్థల్లో 255 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, టెన్త్ నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలన్నారు.
PPM: జిల్లా నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిర్వహించనున్న ధర్నాకు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలిరావాలని గరుగుబిల్లి పిఆర్టియు అధ్యక్షులు మర్రాపు రామారావు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.
ATP: పెద్దవడుగూరు ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించిన ఆయన వెంటనే డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
KDP: పోరుమామిళ్లకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మద్దికాయల బాలరామిరెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన మృతిపట్ల జర్నలిస్ట్ సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కలం కార్మికుడిగా ఎన్నో సామాజిక అంశాలపై ఆయన తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.
NDL: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ ఇవాళ శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించనున్నారు. డ్యామ్ ప్రస్తుత స్థితిగతులు, అవసరమైన మరమ్మతులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం శ్రీశైలంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నీటి విడుదల, డ్యామ్ నిర్వహణపై ఈ భేటీలో చర్చించనున్నారు.
GNTR: నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝళిపించారు. మోతీలాల్ నగర్‌లో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఇళ్ల తొలగింపులను సీసీఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, రైల్వే అధికారులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
BPT: ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని అద్దంకి మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కేవీ.శ్రీనివాసరావు కోరారు. ఈ నెల 23వ తేదీ వరకు అద్దంకి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ (నమోదు) ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
కృష్ణా: గన్నవరం పరిధిలోని రాయ్‌నగర్‌లో సోమవారం ఐదుగురు యువ ఇంజినీర్లు కలిసి సరికొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ విద్యను పూర్తిచేసిన వీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రొపెలర్స్, రోబోటిక్స్ డిజైన్‌ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరి సంకల్పానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని కందులాపురం సెంటర్ వద్ద రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా మంగళవారం కన్వెక్స్ మిర్రర్స్‌ను ఏర్పాటు చేశారు. మలుపుల వద్ద వాహనదారులకు స్పష్టమైన దృశ్యాన్ని కల్పించేందుకు ఈ అద్దాలు ఉపయోగపడతాయని ఎస్సై శివకృష్ణ రెడ్డి తెలిపారు. వీటి ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గమనించే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.
SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.