NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శనివారం తోటపల్లి గూడూరు మండలంలోని కామాక్షి నగర్, తోటపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎస్ఐర్ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య: మదనపల్లి పోలీసు సమావేశ మందిరంలో ముగ్గురు ఏఎస్సైల పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. 35 ఏళ్లకు పైగా సేవలందించిన ఏఎస్సైల మాబూ సాహెబ్, వెంకటరమణ, శేఖర్ రావులను ఎస్పీ ధీరజ్ సత్కరించి, వారి సేవలను కొనియాడారు. పోలీసుల సుదీర్ఘ సేవలో జీవిత భాగస్వాముల త్యాగం ఎంతో గొప్పదని ఎస్పీ పేర్కొన్నారు.
ELR: గుండుగొలనులోని వింధ్యవాసిని మంచినీటి చెరువు మరమ్మతు పనులను స్పెషల్ ఆఫీసర్, ఎంఈవో భాస్కర్ కుమార్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువుల వద్ద నిఘా పెంచుతామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
KDP: స్మార్ట్ పోలీసింగ్‌లో కడప జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శనివారం డీపీవోలో నేర సమీక్ష నిర్వహించిన ఆయన, డ్రోన్లు, ఈ-సాక్ష్య యాప్‌ల ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అసాంఘిక శక్తులు, రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నేరాలు పునరావృతమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు.
WG: ఆకివీడులో శనివారం సీఐటీయూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్మిక ఉద్యమాల్లో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని ఆకివీడు మండల కన్వీనర్ బొడ్డుపల్లి రాంబాబు అన్నారు. కార్మికుల హక్కుల కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో తమ సంఘం ముందుండి నడిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
TPT: సూళ్లూరుపేట మండలం పేర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శనివారం సాయంత్రం నిర్వహించిన ధర్మపథం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముద్ర కూచిపూడి డాన్స్ ఇనిస్టిట్యూట్ కళాకారులు గణపతి తాళం, అయిగిరి నందిని, ముద్దుగారే యశోద వంటి నృత్య ప్రదర్శనలతో అలరించారు. నాట్య గురువు భాగవతుల శైలజ బృందాన్ని దేవస్థాన అధికారులు సత్కరించి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
VZM: కొత్తవలస పట్టణంలో ఉన్న కళ్యాణ మండపాల యాజమానులతో సీఐ టి.వి.విజయకుమార్ శనివారం ఇటీవల తరచుగా జరుగుతున్న నేరాలపై శనివారం అవగాహన కల్పించారు. తరచుగా జరుగుతున్న నేరాలు దృష్టిలో ఉంచుకుని తమ కళ్యాణ మండపాల వద్ద నాణ్యతతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరం జరిగిన గంటలో నేరస్థులను పట్టుకోవచ్చని చెప్పారు. పోలీసు వారికి సహకరించాలని కోరారు.
CTR: ఎస్ఆర్పురం మండలంలో రేపు ఎమ్మెల్యే డాక్టర్ థామస్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పర్యటించనున్నారు. కొత్తపల్లిమిట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన వారపు సంత గేటును సాయంత్రం వారు ప్రారంభించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ వారపు సంత అందుబాటులోకి రావడం వల్ల స్థానిక రైతులు, వ్యాపారులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని, క్రయవిక్రయాలు మరింత సులభతరం అవుతాయని నేతలు పేర్కొన్నారు.
KRNL: ఓటర్ల జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇవాళ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామం వద్ద శనివారం ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఎదురైంది. ఒక వాహనం మీద ఒక భార్యాభర్త, నలుగురు చిన్న పిల్లలతో కలిసి ప్రయాణించడం చూసిన సీఐ రేవతమ్మ వాహనం ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖ ప్రమాదాల నివారణకు ఎన్నో అవగాహన ఇస్తున్నప్పటికీ మార్పు రాలేదని చివరికి డేంజరస్ డ్రైవింగ్ కింద రూ. 2500 జరిమానా విధించారు.
మార్కాపురం: పామూరు మండలం ఇరువురు జంక్షన్ వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలు కావడంతో వారిని 108 అంబులెన్స్‌లో పామూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరూ గుమ్మలంపాడు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. వీళ్ళందరూ ఓ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
PPM: పదవీ విరమణ పొందిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపండి అన్నారు. మీ సేవలు చిరస్మరణీయం అని ఎన్నో త్యాగాలు చేసి సుదీర్ఘ కాలం పోలీస్ శాఖకు వెలకట్టలేని సేవలందించిన మీకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖలో 36 సంవత్సరాలు దాటి సుదీర్ఘకాలం ఉత్తమ సేవలు అందించారన్నారు.
ATP: రాయదుర్గంలో తాగునీటి సరఫరా ఇబ్బందులపై మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు. వారం రోజులకు కూడా నీరు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం వల్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సోమవారం నుంచి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
E.G: కోరుకొండలోని MLA బత్తుల బలరామకృష్ణ కార్యాలయంలో శ్రీరంగపట్నం ప్రాంత రైతులతో ఆయన శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ప్రాంతంలో బురద కాలువ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను, కాలువ పూడిక నష్టాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యపై తక్షణమే స్పందించి, ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.