BPT: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా బాపట్ల పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు. జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ (IPS) పర్యవేక్షణలో మంగళవారం పలు జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రహస్య సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ రైడ్లలో పలువురు జూదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
GNTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కార్యక్రమాన్ని గుంటూరు 21వ డివిజన్ యతిరాజుల కాలనీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు పున్నమ్మ కుటుంబానికి తొలి సోలార్ ప్యానెల్స్‌ను ఎమ్మెల్యే అందజేశారు.
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని TDP ఇంఛార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ, మంత్రి నారా లోకేష్‌ను కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. కాలేజీకి భవనాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
ELR: వేలేరుపాడు (మం) బండ్ల బోరు గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో మండల సమావేశం మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య మాట్లాడుతూ.. ఈనెల 17న పెద్ద వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చేస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అనేక లాభాలు కలుగుతాయని వివరించారు.
AKP: ప్రభుత్వం తమకు ఇచ్చిన అసైన్డ్ భూములను వదులుకునే ప్రసక్తే లేదని రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దళిత రైతులు స్పష్టం చేశారు. భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత రైతులు ర్యాలీ నిర్వహించారు. తామంతా కుటుంబాలతో ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు.
NLR: రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిక్సూచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ఉదయగిరి మండలం పుల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి బొమ్మ గీసి పలువురిని అబ్బుర పరిచింది. రెండో తరగతి చదువుతున్న గాజులపల్లి చక్షిత్ రెడ్డి ఆ మహానీయుడు బొమ్మను చిత్రలేఖనం చేయడంపై పలువురు అభినందనలు తెలిపారు.
ATP: శింగనమల నియోజకవర్గంలో పీఎంఏజేఏవై పథకం కింద డ్వాక్రా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీలేఖ రూ.34 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. బుక్కరాయసముద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి నుంచి ఆలం నరసనాయుడు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రకాశం: పెరుగుతున్న విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రజలు సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ముక్తినూతలపాడు కాలనీలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో ఈ పథకం అమలుకు రూ.31.18 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ELR: ఉంగుటూరు మండలం ఏ. గోకవరంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో నిలిచిపోయిన మురుగునీటి సమస్యకు అధికారులు మంగళవారం పరిష్కరించారు. మురుగు కాలువలకు కొందరు అడ్డుకట్ట వేయడంతో ఇళ్ల మధ్య నీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానికులు MLA ధర్మరాజుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో MPDO మనోజ్ రంగంలోకి దిగి అడ్డుకట్టలను తొలగింపజేశారు.
BPT: అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా PM సూర్యఘర్ SC/ST పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరై రిబ్బన్ కట్ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VZM: విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ను SP దామోదర్ ఇవాళ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను మోడల్ పోలీస్ స్టేషనుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
E.G: సీతానగరం మండలంలోని చిన్నకొండేపూడి, సింగవరం, వంగలపూడి, రామచంద్రపురం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతానగరం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు.
NLR: తమ సమస్యలు పరిష్కరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మత్స్యకార సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. మంగళవారం డీపీఆర్ నివాసంలో ఆయనను కలిశారు. తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల బోట్లు సరిహద్దుల్లోకి రాకుండా ప్రభుత్వం ఇరువు రాష్ట్రాలతో చర్చలు జరపాలన్నారు. మత్స్యకారులకు 50 బోట్లు కొనుగోలుకు 20 శాతం సబ్సిడీ కల్పించాలన్నారు.
కోనసీమ: ఆలమూరు మండలం నర్సిపూడి పీఏసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షులు రాయుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమకు పంటకు మద్దతు ధర పొందచ్చన్నారు.
SKLM: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు కలెక్టర్‌ను ఆదేశించారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో IFWJ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించగా, మంత్రి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో చర్చించి సమస్యను పరిష్కరిస్తానన్నారు.