మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది.
YS Sharmila: మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరిగినట్లు సమాచారం. తన తండ్రి హత్యపై విషయంలో సునీత ముందు నుంచి గట్టి పోరాటమే చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కూడా కోరారు. ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్‌గూడ జైలులో రిమాండు ఖైదీలుగా ఉండగా.. అవినాష్‌రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.