కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసేశారు. టీఆర్ఎస్ గా తెలంగాణ కే పరిమితమైన పార్టీని… బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చేశారు. పార్టీ పేరు అయితే మార్చారు.. కానీ.. ఆ తర్వాత ఏంటి అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ అంటే… కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం అయితే సరిపోదు. కనీసం రెండు, మూడు రాష్ట్రాల్లో పోటీ చేయాలి. అక్కడ కూడా క్యాండిడేట్స్ ని ఎంపిక చేయాల్సిన పని ఉంది. అంతేనా.. కేసీఆర్ కేవలం జాతీయ పార్టీ పెడితే సరిపోతుందని అనుకోలేదు. ఏకంగా పీఎం పీఠం పైనే ఆయన దృష్టి ఉంది. అంటే.. కచ్చితంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే… అన్ని రాష్ట్రాల కన్నా.. ఏపీలో పార్టీని విస్తరించడం కాస్త సులభమనే చెప్పొచ్చు. అందుకే ముందు కన్ను ఏపీపై ఉంటుదనే ప్రచారం మొదలైంది.
అంతే… ఈ ప్రచారం ఎఫెక్ట్.. ఏపీలోని ముఖ్య పార్టీలో కలవరం మొదలైంది. ఈ కొత్త పార్టీ ముందు ఏపీలో పట్టు సాధిస్తే.. ఆ తర్వాత… ఇతర రాష్ట్రాల్లో పట్టు సాధించడం చాలా సులభమౌతుందనే అభిప్రాయాలు మొదలౌతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ముందుగానే.. దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీయార్ పర్సనల్ గా ఏపీలోని వివిధ పార్టీల నేతలకు గాలమేస్తున్నారట. కాంగ్రెస్, టీడీపీల్లోని తన సన్నిహితుల్లో కొందరికి తానే నేరుగా ఫోన్లు చేసి మాట్లాడారట. మరికొందరికి తన సన్నిహితుల ద్వారా మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలా ఫోన్లు అందుకున్నవారిలో అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్, ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణ పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు కాకుండా పై రెండు పార్టీల్లోని చాలామందితో టీఆర్ఎస్ ముఖ్యులు టచ్ లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతలు కేసీయార్ పార్టీలోకి మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో… ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలందరినీ… ఆకర్షించే పనిలో కేసీఆర్ పడినట్లు తెలుస్తోంది. మరి ఈ జాతీయ పార్టీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.