ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లోనే వేసవి తాపం ఎక్కువ కావడంతో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో బడుల్లో విద్యార్థులు నీటిని తాగేందుకు వీలుగా రోజుకు మూడు సార్లు ‘వాటర్ బెల్’ మోగిస్తారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Waterbell in Schools: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు(Temperatures) సరాసరిన 40 డిగ్రీలను దాటి నమోదు అవుతున్నాయి. దీంతో ఇక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల బడికి హాజరయ్యే విద్యార్థుల్లో డీ హైడ్రేషన్( Dehydration) సమస్యలు తలెత్తకుండా చూడాలి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఇకపై ఏపీ బడుల్లో రోజుకు మూడు సార్లు ‘వాటర్ బెల్’(Waterbell)ని మోగించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్.. జిల్లా విద్యా శాఖ అధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు( Half Day Schools) జరుగుతున్నాయి. వేసవి తాపం వల్ల ఉదయం ఏడున్నరకే బడులు ప్రారంభం అవుతున్నాయి. దీంతో వాటర్ బెల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని విద్యా శాఖ… డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పకుండా నీటిని తాగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగుతుంది. ఉదయం 8:44, 10:05, 11:50 గంటలకు వాటర్ బెల్ కచ్చితంగా మోగుతుంది. ఈ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కచ్చితంగా నీటిని తాగేలా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. ఇదిలా ఉండగా ఏపీలోని బడులన్నింటికీ ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.