ఓ వైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రపై చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ సాగుతుండగా, మరోవైపు ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అంటూ నినదించారు. ఇటీవల ధర్మాన మాట్లాడుతూ… చంద్రబాబు అమరావతిలో భూములన్ని కొనేసి, మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని, దీనిని తాము అంగీకరించమని, అమరావతే రాజధానిగా ఉంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను మరో రాష్ట్రంగా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటుండగా, ధర్మాన ఇలా మాట్లాడటంపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్ర రాష్ట్రం అజెండాగా జై ఉత్తరాంధ్ర పేరుతో మరో పార్టీ పుట్టుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఏ ప్రభుత్వం వచ్చినా ఉత్తరాంధ్ర అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని, ఇక్కడ వంశధార, నాగావళి వంటి నదులు, ఎన్నో సహజ వనరులు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఇతర ప్రాంతాల నుండి ఉంటున్నారని, దీంతో శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడానికి తమ ప్రాంతం నేతలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. వెనుకబడిన ఈ జిల్లాల స్వావలంబన సాధన లక్ష్యంగా సంక్రాంతి పండుగ తర్వాత జై ఉత్తరాంధ్ర పార్టీని ప్రారంభిస్తున్నట్లు రామారావు తెలిపారు.
రామారావు శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంకు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. యూపీఎస్సీలో ఆయన 104వ ర్యాంకు సాధించిన ఆయన, పాట్నా, హైదరాబాద్, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకున్నారు. 2019లో జనసేన పార్టీ నుండి శ్రీకాకుళం లోకసభ స్థానానికి పోటీ చేశారు. అయితే ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాజకీయ పార్టీ ఉంటేనే, అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. తమ పార్టీని రిజిస్టర్ చేసుకుంటామని, ఆ తర్వాత తమ ప్రాంతంలోని జిల్లాల్లో ఇంటెలెక్చువల్స్తో సమావేశాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంతో పాటు గోదావరి జలాలను ఇచ్చాపురం వరకు తీసుకు రావడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రత్యేక రైల్వేజోన్ వంటి అంశాలు తమ ప్రాధాన్యతలు అని చెబుతున్నారు.