జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రోడ్డుపై సభలు, సమావేశాలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 23వ తేదీన జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఏపీ హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో 1ని సస్పెండ్ చేసింది. జనవరి 20 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1న మీద ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీవోను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ జీవోను జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
రామకృష్ణ పిటిషన్ ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ తీర్పు చెరప్పింది. జీవో నెంబర్ 1ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది. గత నెలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన గుంటూరు, కందుకూరు సభలలో పలువురు ప్రాణాలు కోల్పాయారు. దీంతో ప్రభుత్వం రోడ్డుపై సభలను, సమావేశాలను నిషేధిస్తూ జీవో తెచ్చింది. దీనిపై టీడీపీ, జనసేన, కమ్యూనిస్ట్, బీజేపీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రమాద ఘటనలో ఆయా వర్గాల పొరపాటు ఉందని, అందుకు సభలు, సమావేశాలు రద్దు చేయడం ఏమిటని నిలదీశాయి. ఇదే జీవో జగన్కు కూడా వర్తిస్తుందా అని నిలదీశాయి.