ఏపీలో టీడీపీ నేతలు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జైల్లో ఉన్న చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న బాబు అలర్జీ సమస్యతో బాధపడుతున్నారు. తీవ్ర ఉక్కపోతతో ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని నిరసిస్తూ ఆదివారం రాత్రి 7 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలోని విద్యానగర్ క్యాంప్ సైట్ వద్ద నారా భువనేశ్వరి మహిళలతో కలిసి నిరసన తెలిపారు.
నారా భువనేశ్వరి తన చేతులకు తాళ్లు కట్టుకుని నిరసన తెలుపగా బాబుతో నేను, న్యాయానికి సంకెళ్లు అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర నేతల పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు.
జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి ప్రాణహాని ఉందని, చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపణలు చేశారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి హైదరాబాదులోని తమ నివాసంలో చేతులను తాళ్లతో కట్టుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.