RK Roja: ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి రోజా (RK Roja) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పురందేశ్వరికి పదవులు, డబ్బుపై ఆశ తప్ప నైతిక విలువలు లేవన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వినిపిస్తూ.. టీడీపీకి కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. ఆ పార్టీకి ద్రోహం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం విజయవాడలో ఆర్కే రోజా మాట్లాడారు.
పురందేశ్వరి బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టి చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఎవరి కోసం పనిచేస్తున్నారో ప్రజలకు అర్థమైందన్నారు. చంద్రబాబు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. పురందేశ్వరిని పార్టీ నాయకత్వం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు చేసిన స్కామ్లపై విచారణ చేయాలని సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ చంద్రబాబు ముంచాడని రోజా విమర్శించారు. గత పాలనలో భారీగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చేసిన స్కాములు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని తెలిపారు. అవినీతి బయట పడుతుందనే తోక పార్టీని వెంటేసుకుని తిరుగుతున్నారని చెప్పారు. ఆ విషయం జనాలకు కూడా అర్థమయ్యిందని పేర్కొన్నారు.