రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రశాంత్ కిశోర్(prashant kishor) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. ఆయన.. ఏపీలో జగన్ కోసం పనిచేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. 2019 ఎన్నికల్లో జగన్ కి ప్రశాంత్ కిశోర్ టీమ్ సహాయం చేశారు. కాగా.. తాజాగా… ఆయన జగన్(jagan mohan reddy) పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
“జగన్‌కు సాయం చేసి పెద్ద పొరపాటు చేశా. ఎందుకు సాయం చేశానా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా. అదేవిధంగా బిహార్ లో నితీశ్‌కుమార్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు కూడా కృషి చేశా. ఈ రెండు నేను చేయకుండా ఉండాల్సింది” అని హాట్ కామెంట్స్ చేశారు.
ఈ ఇద్దరు నాయకుల కోసం చాలా సమయాన్ని వృథా చేసుకున్నట్టు పీకే చెప్పారు. అంతేకాదు, ఈ సమయంలో కాంగ్రెస్‌ను బతికించుకునేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న గాడ్సే సిద్ధాంతాన్ని ఎదుర్కోవాలంటే అదొక్కటే(కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపచేసుకోవడం) మార్గమని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని అన్నారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే.. పశ్చిమ చంపారన్ జిల్లా లౌరియాలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.