జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీ (Janasenaparty) కి మళ్లీ గాజు గ్లాస్‌ను గుర్తును కేటాయించింది. ఓటింగ్ శాతం లేకపోవడం, చట్టసభల్లో కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో జనసేన పార్టీ కొన్ని నెలల కిందట గ్లాసు గుర్తును కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే గ్లాసు గుర్తు (Glass Symbol) ను తమకే కేటాయించాలన్న జనసేన పార్టీ కేంద్ర ఎన్నికలని కోరింది. మరోవైపు జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించడం పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాని (Election Commission) కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పవన్ వెల్లడించారు.
ఏపీలో 137 స్థానాల్లో, తెలంగాణ(Telangana)లో 7 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారని వివరించారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేయడానికి తమ అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం అని పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావత్ సిబ్బందికి పేరుపేరునా తన తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన చేశారు.