సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలంలోని 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత అందజేశారు. మొత్తం రూ.10 లక్షల విలువైన చెక్కులను స్థానిక మండల నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు. ఆపద సమయంలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
VSP: విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్ ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ లైవ్ రూ.145, స్కిన్తో రూ.260, స్కిన్ లెస్ రూ. 270, శోంఠాం రూ.300లకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.1000కు, డజన్ గుడ్లు రూ.55లకు అమ్మకాలు చేపట్టారు. అప్పుఘర్, ఎంవీపీ, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాల్లో తాజా చాపల కోసం కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు.
PPM: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం పార్వతీపురం పురపాలక కార్యాలయానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. పుర కమిషనర్ డి. పావని ఈ విషయాన్ని తెలిపారు. అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతుంది. పలు ప్రాంతాల్లో పర్యటన ఉంటుంది. పార్వతీపురం అభివృద్ధి కూటమితోనే సాధ్యం అన్నారు.
E.G: రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
బాపట్ల: పెదగాదెలవర్రులోని చెరువులో అక్రమంగా మట్టి తవ్వి విక్రయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వారం రోజులుగా ట్రక్కుల ద్వారా మట్టి తరలింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఒక్కో లోడు రూ.800 నుంచి 1000 వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల దోపిడి పెరుగుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ATP: నెల్లూరులో జరిగిన 8వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 44 పతకాలు సాధించిన విజేతలకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ చైర్మన్ గడుపూటి నారాయణస్వామి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా నుంచి 41 మంది పాల్గొనగా 22 స్వర్ణ, 16 రజత, 10 కాంస్య పతకాలు రావడం విశేషం.
కోనసీమ: స్వచ్ఛ మండపేట సాధనే లక్ష్యంగా పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ టీవీ రంగారావు శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై ప్రతిరోజూ రాత్రి సమయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు రహదారులపై బహిరంగంగా చెత్త వేయకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KKD: కొత్తపల్లి మండలం అమీనాబాద్ వెళ్లే రహదారిలో శనివారం సాయంత్రం రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంకు సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ఆటోలు ఢీకొనడంతో అవి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
KRNL: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పార్ట్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరీక్షలను ఆయన తనిఖీ చేసి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే రెండేళ్ల వరకు డీబార్ చేస్తామని హెచ్చరించారు.
నంద్యాల: రుద్రవరం మండలంలోని 21 గ్రామ పంచాయతీల పాలన కోసం జిల్లా అధికారులు ప్రత్యేక అధికారులను నియమించారు. శ్రీరంగాపురం తదితర గ్రామాలకు ఎంపీడీవో భాగ్యలక్ష్మి, మరికొన్ని గ్రామాలకు డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. చందలూరు ప్రాంతానికి వ్యవసాయ అధికారి సుమతి, రుద్రవరం పరిధిలోని గ్రామాలకు డాక్టర్ మనోరంజన్ ప్రతాప్‌ను నియమించినట్లు వెల్లడించారు.
గుంటూరు: అరండల్‌పేటలో బంగారం వ్యాపారిని మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. ఫైనాన్స్‌లో ఉన్న తన బంగారాన్ని విడిపించాలంటూ నమ్మబలికి ఓ మహిళ వ్యాపారి వద్ద నుంచి రూ.19 లక్షల నగదు, రూ.4 లక్షల విలువైన ఆభరణాలు తీసుకుంది. తరువాత వాటిని తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఇవాళ నిర్వహించనున్నారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, హరిత విప్లవానికి తోడ్పడిన ప్రముఖ రాజనీతిజ్ఞుడుగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్‌కు పేరుంది. ఉదయం 10.00 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో, ఉద్యోగులు పాల్గొని నివాళులర్పించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఆర్.వెంకట్రామన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు సీఈవోగా ప్రమోషన్ కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. ఈయన గతంలో జిల్లాలో ఎంపీడీవో గా పనిచేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
కృష్ణా: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమపై దోపిడీ ఆరోపణలు చేయడం అనవసరమన్నారు. ఆరోపణలను నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
NLR: వలేటివారిపాలెం మండలంలో కుక్కలకు సోకుతున్న చర్మవ్యాధుల పట్ల పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ చెన్నకేశవులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. మాంసం దుకాణాల వద్ద కోడి వ్యర్థాలు తినడం వల్లే ఈ సమస్య వస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యాధి కుక్కల నుంచి మనుషులకు గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.