NTR: విజయవాడలో బాడీ స్పా నిర్వహకులు రూట్ మార్చారు. పోలీసులు ఇటీవల దాడి చేయడంతో వాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగరంలోని హోటల్ రూమ్లను బుక్ చేసుకొని వాటిల్లో బాడీ స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పీవీపీ వద్ద ఉన్న ఓ హోటల్లో బాడీ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
KRNL: బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర స్వామి భక్తుడు, భాజపా నాయకుడు శ్రీమఠానికి రూ.2 లక్షలు విరాళంగా అందజేసినట్లు మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. శనివారం ఆయన మంత్రాలయం చేరుకుని గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శించుకున్నారు. అనంతరం అన్నదానానికి రూ.లక్ష, శాశ్వత సేవకు రూ.లక్ష చొప్పున చెక్కును అందించినట్లు మేనేజర్ పేర్కొన్నారు.
NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జాతీయ రహదారిపై బ్రహ్మయ్య కాలేజి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. గాయపడిన వ్యక్తి నార్త్ రాజుపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా గుర్తించిన స్థానికులు 108 వాహనంలో నెల్లూరుకు తరలించారు.
ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు నగర ఎన్నికలు ఈనెల 10వ తేదీన జరుగుతాయని ఎన్నికల అధికారి సయ్యద్ మసూద్ తెలిపారు. అదే రోజు ఉదయం నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణ, పోలింగ్ ఉంటుందని చెప్పారు. సంఘం సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
KKD: పిఠాపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు మే 9న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బత్తిన లక్ష్మణదొర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 5న నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న ఉపసంహరణ, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. మే 9న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం బార్ అసోసియేషన్ కార్యాలయంలో సంప్రదించాల న్నారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లికి చెందిన నేతాజికి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై శివ బసవరాజు తెలిపారు. పాకిస్థాన్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
KDP: బ్రహ్మంగారిమఠంలో ఆదివారం నుంచి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకుఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. వేసవికాలం కావడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మఠం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు.
KKD: క్రీడాకారులకు పుట్టినిల్లు కాకినాడ జిల్లా అని ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, సానా సతీష్ పేర్కొన్నారు. రూరల్ ఎన్టీఆర్ బీచ్‌లో జరుగుతున్న బీచ్ కబడ్డీ పోటీలను శనివారం రేట్ వారు సందర్శించారు. పోటీలు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఉత్సాహభూరిత వాతావరణంలో పురుష, మహిళా క్రీడా పోటీలు బీచ్‌లో జరగడం అభినందనీయమన్నారు.
GNTR: మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నుంచి ఫోరెన్సిక్ వర్క్‌షాప్ ప్రారంభమవుతోంది. ఈ వర్క్‌షాప్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించనున్నారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో విచారణాధికారులు, డాక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో వాగులు, వంకలను సైతం ఆక్రమించి కొందరు అక్రమంగా వెంచర్లు, కట్టడాలు నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం రెవెన్యూ యంత్రాంగం కదిలింది. తహసిల్దార్ రవిశంకర్ ఆధ్వర్యంలో పది బృందాలు పట్టణంలోని ఆక్రమణలపై సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ భూములను, వాగులు కబ్జా చేసినట్లు తెలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.
VSP: గాజువాక డిపో వద్ద మున్సిపల్ వాటర్ ట్యాంక్‌లో పడి ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ లోపలికి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. పరిసరప్రాంత ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.
కృష్ణా: ఇద్దరు పాత నేరస్థులను శనివారం TGకి చెందిన సత్తుపల్లి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండకు తరలించారు. సత్తుపల్లి సీఐ టీ. కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు, చిలకలూరిపేటకు చెందిన బొమ్మల విజయ్ జైలుశిక్ష అనుభవిస్తూ బయటకు వచ్చాక పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు. వాహనాల తనిఖీలలో పారిపోతుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు.
KRNL: కోడుమూరు పట్టణంలో ముక్కుపచ్చలారని శిశువు మృతదేహం బకెట్‌లో శనివారం లభ్యమైంది. మగ బిడ్డకు జన్మనిచ్చి శిశువును బకెట్లో విడిచి వెళ్లిన సంఘటన స్థానిక సంత మండలం మార్కెట్ సమీపంలోని పాఠశాల వద్ద వెలుగు చూసింది. నెలలు నిండని శిశువు మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని శిశువు మృతదేహానికి ఆసుపత్రికి తరలించారు.
ASR: డుంబ్రిగుడ మండల కురిడి సమీపంలోని చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై పాపినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోగిలికి చెందిన కే.నాగేశ్వరరావు అనే గిరిజనుడు కనిపించడం లేదని ఈనెల 2న స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారి బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శనివారం కురిడి సమీపంలోని ఆయన మృతదేహం లభ్యం అయిందన్నారు.