ASR: హుకుంపేట మండలం రంగశిల పంచాయతీలో ఇటుకల పండగ సందర్భంగా రహదారికి అడ్డంగా కట్టిన తాడు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. బైరొడి వలస గ్రామానికి చెందిన కొర్ర ధర్మారావు బైక్‌పై వెళ్తుండగా తాడు గమనించక మెడకు తగిలి కింద పడి పోయాడు. ఈ ఘటనలో అతనికి మెడకు గాయమైంది. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
GNTR: మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరిలో ‘పీ-4’ పథకం తొలి వార్షికోత్సవ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆర్థికాభివృద్ధికి ‘పీ-4’ పథకం దోహదపడుతుందని తెలిపారు.
NLR: బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. సంగం మండలం మక్తాపురానికి చెందిన డి. బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన రాత్రి బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
E.G: రాజమండ్రిలోని అన్న క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. మంగళవారం శేషయ్యమెట్టలోని అన్న క్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, క్యాంటీన్ల నిర్వహణపై నోడల్ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను మంగళవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ సమస్యలను విన్నవించి వినతిపత్రాలు అందజేశారు. వారి విన్నపాలను సావధానంగా విన్న మంత్రి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గట్టి భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
GNTR: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహావీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను లోకానికి బోధించిన గొప్ప దార్శనికుడు భగవాన్ మహావీర్ అని కొనియాడారు.
AKP: నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబంతో కలిసి మంగళవారం ప్రారంభించారు. టీటీడీ కళ్యాణ మండపం వద్ద ప్రారంభించిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ఒక రోజు టికెట్ ఖర్చులను చెల్లించడం జరిగింది. పట్టణంలో మూడు చోట్ల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు.
ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఇప్పటి వరకు 630 క్యూసెక్కుల నీరు వదలగా, ప్రస్తుతం దాన్ని 300 క్యూసెక్కులకు కుదించారు. కాలువ పరిధిలోని 49 చెరువులు పూర్తిగా నిండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
PLD: ఈపూరు మండలం పొనుగోటివారిపాలెం గ్రామంలో మంగళవారం రెండో రోజు కూడా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో వాతావరణ మార్పుల వల్ల కలిగిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఏమైనా వ్యాధులతో బాధపడుతున్నారా ఆరా తీస్తున్నారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.
NDL: సిరివెళ్ల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం ప్రిన్సిపల్ జ్యోతి ఆకస్మికంగా మృతి చెందారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు కల్పించడంలో ఆమె కృషి చేసేవారని స్థానికులు తెలిపారు. ఆమె మరణంతో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.
BPT: రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పశువులకు పరీక్షలు, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో మత్తి అనురాధ, గుర్రం మురహరి తదితరులు పాల్గొన్నారు.
TPT: మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతికి వస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అందులోని ఓ మిల్క్ ట్యాంకర్ భోగి బోల్తా పడింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
సత్యసాయి: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతి (వీసీ) జ్యోతి కుమార్‌ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి కూడా వీసీని కలిసి అభినందనలు తెలియజేశారు.
VZM: స్దానిక జమ్ము నారాయణపురంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు శ్రీ శ్రీ శ్రీ మారమ్మ తల్లి పేరెంటాలు తీర్ధ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు మోపాడు శివ తెలిపారు. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.
SKLM: నేత్రదానం శ్రేష్ఠ దానమని, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు అన్నారు. స్థానిక కాకి వీధికి చెందిన గంధం సరోజని (80) మంగళవారం తనువు చాలించారు. నేత్ర దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని మళ్ళీ చూసేలా చేసే ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గమని, నేత్రదానం మహాదానమన్నారు. సరోజని కుటుంబ సభ్యులకు అభినందించారు.