TPT: గూడూరు పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇవాళ ఉదయం వినియోగదారులు బారులు దీరారు. స్టాక్ పరిమితంగా ఉండటంతో తెల్లవారుజాము నుంచే జనం క్యూ కట్టారు. సిలిండర్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.
తిరుపతి జిల్లాలో పోలీస్ డాగ్ చనిపోయింది. 2016లో హైదరాబాద్ మోయినాబాద్‌లోని IITAలో ‘హంటర్’ డాగ్ ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత తిరుపతికి తీసుకు వచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో విశేషంగా కృషి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈక్రమంలో నిన్న చనిపోయింది. ఎస్పీ డి. శ్రీనివాసరావు, సిబ్బంది హంటరు నివాళులర్పించారు.
PPM: ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా, అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్ స్టేషన్‌లోని ఫ్లాట్ పారంలు, తాగునీటి వసతి, విక్రయ దుకాణాలు, మరుగుదొడ్లు పారిశుధ్య పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ASR: సూరంపాలెం ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం నీటమునిగిన యువకుడి మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. ఎస్సై వెంకయ్య ఆధ్వర్యంలో రెండు రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నెల్లిపూడి గ్రామానికి చెందిన కొంజర్ల ఈశ్వర వరప్రసాద్ (21)గా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారు.
CTR: పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంలో గల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మునస్వామి మొదలియార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం జరుగుతుందని చెప్పారు. శంకర్ నేత్రాలయ ఆసుపత్రి నుంచి వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
సత్యసాయి: హిందూపురం అహమ్మద్ కాలనీలో ఇవాళ ఉదయం పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో డీఎస్పీ మహేష్ నేతృత్వంలో డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా ఈ మెగా కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేసి, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
E.G: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాజమండ్రి, గోకవరం డిపోలలో నిర్బంధిత 38 వాహనాలకు ఈనెల 30న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా రవాణాశాఖాధికారి ఆర్.సురేష్ ఇవాళ తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సీజర్ యార్డ్‌లో వేలం పాట జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు ముందస్తుగా వాహనాలను పరిశీలించుకోవచ్చన్నారు.
ATP: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆరోగ్యశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని, అబార్షన్ మందులు అమ్మే మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Vsp: వేగవంతమైన నగరీకరణ వల్ల వేడి తరంగాలు, భారీ వర్షాలు, నగర వరదలు వంటి వాతావరణ ముప్పులు పెరుగుతున్నాయని ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఏఎన్వీ సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నగర ఉష్ణద్వీప ప్రభావం, అనియంత్రిత విస్తరణ వల్ల ప్రజారోగ్యం, మౌలిక వసతులు దెబ్బతింటున్నాయని చెప్పారు.
Vsp: ఏయూ వసుదైక కుటుంబ భావనకు ప్రతీకగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఇక్కడ చదవడం ఏయూ అంతర్జాతీయ ఖ్యాతికి నిదర్శనమని చెప్పారు.
ASR: ఎల్-నినో కారణంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో గిరి ప్రాంత పంటలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. గురువారం ఎల్-నినో వాతావరణ ప్రభావం, ముందస్తు చర్యలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచించారు.
NTR: మైలవరంలోని బంధగార రోడ్డులో శ్రీరాముల వారి ఆలయం వద్ద వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ప్రతి ఏడాది ఈ రోడ్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది వివాదాలకు దారి తీసే విధంగా కాలువలోని బురదను తీసి అన్నదానం జరిగే చోట వేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
VSP: పెందుర్తి పరిధిలో ముగ్గురు వృద్ధులను దారుణంగా హత్య చేసిన నిందితుడు చందాక రాంబాబుకు జిల్లా మహిళా కోర్టు జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. కొత్త భవనాల వద్ద కాపలా ఉన్న వృద్ధ దంపతులతో పాటు మరో వృద్ధురాలిని నిందితుడు హత్య చేసినట్లు విచారణలో రుజువైంది. శిక్షతో పాటు రూ.30,000ల జరిమానా, బాధితులకు లక్ష రూపాయల పరిహారం ప్రకటించింది.
ATP: గార్లదిన్నె మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సతీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎమ్ఎసీ, గ్రూపుల్లో ప్రవేశాలు పొందవచ్చునన్నారు.
ప్రకాశం: మర్రిపూడి మండలం నరసాపురంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నేడు విద్యుత్ ప్రభను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కోదండ రామస్వామి తిరుణాల సందర్భంగా ప్రభను ఏర్పాటు చేయనున్నారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు గమనించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.