KRNL: రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు రెండో విడతలో జిల్లాకు చేరాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి 8,309 పాసుపుస్తకాలు రాగా, వాటిలో 7,921 భూ యజమానులకు ఇప్పటికే పంపిణీ చేశారు. మార్చి నెలకు చెందిన 8,866 పాసుపుస్తకాలు జిల్లాకు చేరగా, మండలాల వారీగా అధికారులు స్వీకరించారు. పరిశీలన అనంతరం రేపు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఏఆర్ ఏఎస్ఐ భాషా, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామిలను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేశారు. కష్టసమయాల్లోనూ శాఖకు అందించిన సేవలు అమూల్యమని ఎస్పీ ప్రశంసించారు. విశ్రాంతి జీవితం కుటుంబంతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.
ATP: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సముద్రంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. మార్చి నుంచే ఎండలు ముదురుతాయని, రైతులు బెట్టకు తట్టుకునే స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని సూచించారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా, 2, 3 తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లను జారీ చేయబోమని స్పష్టం చేసింది. 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 3న జారీ చేస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.
మన్యం: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం వేళల్లో దట్టమైన మంచు కమ్ముకోవడంతో పలు గిరిజన గ్రామాలు మంచు దుప్పటిలో మూసుకుపోయాయి. రహదారులపై కనీస దృశ్యమానత లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మామిడి పూత, జీడి పంటలకు నష్టం కలుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
VZM: శ్రీ రామనారాయణంలో ఇవాళ శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయం అర్చకులు శ్రీ హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, పద్మ, చంద్రకళ, రవి, భక్తులు పాల్గొన్నారు.
W.G: నరసాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం UTF జిల్లా కుటుంబ సంక్షేమ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్, డైరెక్టర్ ఏ. రామభద్రం పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ కుటుంబాలకు అండగా నిలిచేందుకు సంక్షేమ సంఘం ఆవశ్యకతను వివరించారు. విధి విధానాలను తెలియజేశారు.
VSP: జాతీయ రహదారి పాత గాజువాక కూడలిలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందారు. పాత గాజువాక సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో BHPV నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు క్షత గాత్రుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు సీఐ హుస్సేన్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: వివాహిత వ్యక్తిగత వీడియోలను ఆమె భర్తకు, తండ్రికి పంపి వేధిస్తున్న మాజీ ప్రియుడిపై అరండల్‌పేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గతంలో ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకోవడంతో, మాజీ ప్రియుడు కక్ష పెంచుకున్నాడు. పాత వీడియోలను ఉపయోగించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
NDL: డోన్ RTC డిపో నుంచి ప్రతి ఆదివారం వాల్మీకి గుహలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ చలపతి తెలిపారు. డోన్ నుంచి ఉదయం 9.30 గంటలకు బస్సు బయల్దేరి ప్యాపిలి మండలం చిగురుమాను, నల్లమేకల పల్లి మీదుగా 1.45 గంటలకు వాల్మీకి గుహలకు చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంకాలం 5.15 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు డోను చేరుకుంటుందని, ఛార్జీ రూ.45 ఉంటుందన్నారు.
అన్నమయ్య: అప్పుల బాధను తట్టుకోలేక రామసముద్రం మండలం పేడరాసుపల్లికి చెందిన రైతు నారాయణ (59) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వ్యవసాయం కోసం తీసుకున్న సుమారు రూ. 7 లక్షల అప్పులు, టమోటా సాగులో ఆశించిన ధర రాక నష్టపోవడంతో ఆయన ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి,చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
WG: మార్చి 1న నరసాపురం 132/33కేవి సబ్-స్టేషన్ వద్ద ఏపీ ట్రాన్స్ కో ‘లైన్ ఇన్ లైన్ అవుట్’ పనులు చేపడుతున్నట్లు ఈ ఈ కె. మధు కుమార్ తెలిపారు. ఈ పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నరసాపురం, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగనుంది. లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అవసరాన్ని బట్టి కోతలు విధిస్తామని తెలిపారు
KRNL: కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు.
KDP: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని బీమా కంపెనీ మేనేజర్లు,న్యాయవాదులతో సమావేశమయ్యారు. మోటారు వాహన ప్రమాదాల పరిహారం కేసులపై చర్చించారు.
ASR: అరకులోయ మండలం పరిధిలో అరుదైన ఆకారంలో పెరిగిన ముల్లంగి దుంప అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలోని చినలబుడు పంచాయతీ మాలివలస గ్రామానికి చెందిన గిరిజన రైతు జొయో సాగు చేసిన ముల్లంగి తోటలో త్రిశూలం ఆకారంలో దుంప కనిపించింది. ఒకే మొక్కకు మూడు దుంపలు కలసి పెరగడంతో అవి త్రిశూలాన్ని తలపించే విధంగా ఉండటం విశేషంగా మారింది.