GNTR: జీఎంసీకి పన్ను బకాయిలు చెల్లించని ప్రధాన డిఫాల్టర్లకు వెంటనే ‘రెడ్ నోటీసులు’ జారీ చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షలో పన్ను వసూళ్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఐల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి, గతేడాది కంటే 30 శాతం అధికంగా వసూళ్లు సాధించాలని ఆయన స్పష్టం చేశారు.
NDL: ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం నిర్మించిన R&R కాలనీని బుధవారం మంత్రి బీసీ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇంతమంది నిర్వాసితులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమన్నారు. సొంతిళ్లు, స్వగ్రామాలను ఖాళీ చేసిన ప్రజల త్యాగం మరువలేనిదన్నారు. పోర్టును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తునట్లు చెప్పారు.
GNTR: తెనాలి రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. రేపల్లె మండలం నల్లూరివారిపాలెంకు చెందిన యలవర్తి సుబ్బారావు (70) రెండో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద టిఫిన్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కడపలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలను రు.3000కు పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్‌మన్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హాస్టల్ విద్యార్థులతో కలిసి సీఎంకు పోస్ట్‌కార్డులు పంపించారు.
KRNL: ఎమ్మిగనూరులో BJP జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పద్మావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని BJP నాయకులు గురురాజ్ దేశాయ్, దయసాగర్, మాధవీలత, రామన్న గౌడ్, నారాయణ, SI మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పద్మావతిపై సోషల్ మీడియాలో ప్రచురితమైన వార్త క్రింద “gouse3032” అనే వ్యక్తి ఆమెపై అసభ్యకరంగా రాసినట్లు పేర్కొన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్‌లో భాగంగా 3, 4, 5వ డివిజన్లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉకాయపల్లి GTS సెంటర్‌ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రతను సమీక్షించారు. హాజరు నమోదు పరిశీలించి సమయపాలన పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని కమిషనర్ హెచ్చరించారు.
నంద్యాల జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్. వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న పిల్లలు తమ వినికిడి సమస్యలను తల్లిదండ్రులకు వివరించలేరని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా సత్వర చికిత్స కేంద్రంలోని వైద్యాధికారులను సంప్రదించి పిల్లలకు వినికిడి పరీక్షలు చేయించాలన్నారు.
అన్నమయ్య: వైసీపీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ఛైర్మన్‌పై కులమతాల వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. హెరిటేజ్ అంశంపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం సభను పక్కదారి పట్టిస్తోందని అన్నారు. అచ్చెన్నాయుడిని సభ నుంచి సస్పెండ్ చేసి టీడీపీ నుంచి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
W.G: ఆచంట సబ్ రిజిస్ట్రార్‌గా బీ. జగన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత 6 నెలల నుంచి ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కార్యాలయం నడుస్తోంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎవరికి ఎటువంటి మామూళ్లు ఇవ్వనవసరం లేదన్నారు.
గుంటుపల్లి గవర్నమెంట్ హైస్కూల్‌లో ఎన్టీఆర్ వికాస్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 నుంచి రూ.35,000 వరకు జీతం ఉంటుందని చెప్పారు.
E.G: నల్లజర్ల మండలం పోలవరం కుడి కాలువ గట్ల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కృష్ణారావు హెచ్చరించారు. ఎమ్మెల్యే మద్దిపాటి ఆదేశాల మేరకు ప్రకాశరావుపాలెం, ఆవపాడు, మారెళ్లముడి, సింగరాజుపాలెం గ్రామాల్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
సత్యసాయి: వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. తాగునీటి ఎద్దడి, సరఫరా అంతరాయం, పైప్‌లైన్ లీకేజీల వంటి సమస్యలను మడకశిర 9550306100, హిందూపురం 8247625245, పెనుకొండ 9885447204, పుట్టపర్తి 9490517016, కదిరి 6281434418 నంబర్లకు తెలపాలన్నారు.
TPT: ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారం కాపాడి, రైతుల ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఇవాళ మహతి ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి కొనుగోలు–అమ్మకందారుల నెట్‌వర్కింగ్ సమావేశం నిర్వహించారు. సహజ పద్ధతిలో ఉత్పత్తి చేసిన ధాన్యాలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు చెప్పారు.
BPT: యద్దనపూడి మండలంలో శనగల కొనుగోలు కోసం 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం వ్యవసాయాధికారి (AO) కుమారి తెలిపారు. అనంతవరం, యద్దనపూడి, జాగర్లమూడి, పూనూరు కేంద్రాల్లో రైతులు తమ పంటను విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ-పంట, సీఎం యాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ మద్దతు ధర వర్తిస్తుందని, పంటలో తేమ శాతం 14 లోపు ఉండాలని ఆమె సూచించారు.
PPM: బాల్య వివాహ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. బుధవారం ఐసీడీఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి జరిపే వివాహాలపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని అన్నారు. ప్రజల్ని మరింత చైతన్య పరచాలన్నారు. టీనేజ్ గర్భధారణపై అవగాహన కల్పించాలన్నారు.