కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 430 రెవెన్యూ క్లినిక్ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అన్నమయ్య: రామాపురంలోని సాయి నగర్‌లోని సమర్థ సద్గురు దర్గా స్వామిజీ, సమర్థ సద్గురు మాతాజీ ఆశ్రమంలో రేపటి నుంచి శ్రీరామ నవమి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆశ్రమ మందిరంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
ATP: CM చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్ లభించిందని ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు లోకేష్ కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.
కోనసీమ: ముంజవరం వద్ద వైనతేయ గోదావరి నదిలో త్రిమూర్తులు(55) అనే వ్యక్తి గల్లంతైనట్టు వీఆర్వో కే. దొరబాబు మంగళవారం రాత్రి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలే నికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారని, స్థానిక రామాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్ చెంతన సైకిల్, చెప్పులు, చరవాణి విడిచి పెట్టి గోదావరిలో గల్లంతైనట్టు ఆయన తెలిపారు.
NLR: బుచ్చి మండలం కట్టుబడి పాలెం గ్రామం అల్లూరు కాలువ వద్ద అదే గ్రామానికి చెందిన నాగభూషణమ్మ (60)అనే మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సంతోష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. మహిళకు మతిస్థిమితం లేదని భర్త కృష్ణారెడ్డి పోలీసులకు తెలిపారు. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని భర్త పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలలకు అనుమతి ఇస్తే అందులో ప్రకాశం జిల్లాలోని కురిచేడు, పెద్దారవీడు, పుల్లలచెరువు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ ఆరవ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
తిరుపతి గిరిదర్ దాస్ లైన్‌లో జరిగిన మహిళ మృతి కేసులో భర్తనే నిందితుడిగా ఈస్ట్ పోలీసులు తేల్చారు. ప్రకాశం (D) కంభం (M)నికి చెందిన మోహన రంగా (32) భార్య చైతన్యను గొంతు నులిమి హత్య చేసినట్లు తేలిందన్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అని పోలీసులు పేర్కొన్నారు. మార్చి 13న జరిగిన ఘటన తర్వాత పరారైన నిందితుడు, మార్చి 23న పోలీసులకు లొంగిపోవడంతో కేసు మిస్టరీ వీడిందన్నారు.
మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీపల్లి, రాచర్ల, సియస్పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్యాస్ గోదాములను మంగళవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత రెవెన్యూ అధికారులు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ గోదాముల్లో అమలు చేస్తున్న భద్రతా చర్యలు, పరిశీలించారు.
PLD: ఈపూరు ఏపీ మోడల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులు మూలనపడ్డాయి. 2020లో రూ. 5 కోట్లతో వనికుంట వద్ద పనులు ప్రారంభించినా, ప్రస్తుతం అవి మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో సొంత భవనం లేక సుమారు 400 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేసుకునే సౌకర్యం లేక చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరులోని బెనర్జీపేటలో తాళంవేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి వెండి ఆభరణాలను అపహరించారు. పోలీసుల వివరాలు.. స్థానిక నివాసి రాజావెంకటమురళీకృష్ణ తన కుటుంబంతో ఈ నెల 11న తీర్థయాత్రలకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని 23న తిరిగి ఇంటికి వచ్చి చూడగా, బీరువా తెరిచి ఉంది. అందులోని సుమారు 250 గ్రాముల వెండి ఆభరణాలు మాయమైనట్లు గుర్తించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కర్నూల్: నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు శుభవార్త. మహిళల వసతి కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘సఖి నివాస్’ పేరుతో 30 కొత్త వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో హాస్టల్లో 30 మందికి వసతి కల్పించబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగినులతో పాటు చదువుకునే యువతులకు తక్కువ ధరకే వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు.
VSP: గాజువాకలోని గుడివాడ అప్పన్న కాలనీలో నివాసం ఉంటున్న గాడి గురువులమ్మ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. భర్త గాడి దామస్ జై కుమార్ కోరమండల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రాత్రి డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండడంతో విరగొట్టి చూడగా గురువులమ్మ ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
KKD: జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కోర్టు ఫీజు స్టాంపులు అందుబాటులోకి వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ ప్రసాదరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా కోర్టు బీచ్ స్టాంపులు అమ్మకాలు ఆన్‌లైన్ సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు తెలిపారు.
విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ అబ్దుల్ కరీం నిన్న గుండెపోటుతో మరణించారు. కరీం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జిల్లా వర్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్‌గా 10 ఏళ్లు సేవలందించారు. దీంతో పాటు 35 ఏళ్లగా అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవలు అందించారు. ఈ మేరకు ఆయన మృతదేహానికి డీసీసీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఘన నివాళులు అర్పించారు.