Rajinikanth : ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు : సూపర్ స్టార్ రజనీకాంత్
హీరోగా నా తొలి సినిమా పేరు 'భైరవి' అని రజనీకాంత్ (Rajinikanth) గుర్తుచేశారు. పాతాళభైరవి సినిమా గుర్తుకొచ్చి హీరో పాత్రకు ఒప్పుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ దుర్యోదనుడి పాత్ర చూసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని తెలిపారు
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ (TDP) వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(NTR) శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభ విజయవాడలో ప్రారంభమైంది. పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), నందమూరి బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. శతజయంతి (Satajayanti) వేడుకల ప్రారంభ సభకు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై వచ్చిన రెండు పుస్తకాలను ఈ సభలో రజనీకాంత్ ఆవిష్కరించారు. ఓ పుస్తకం కాపీని బాలకృష్ణకు అందించారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలపై ఓ పుస్తకం, ప్రజలను చైతన్యపరుస్తూ చేసిన ప్రసంగాలతో కూడిన మరో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్టార్ హీరో రజినీ కాంత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రజినీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఎన్టీఆర్ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి(Bhairavi)’’ అని ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.13 ఏళ్లప్పుడు లవకుశ (Lavakusha) మూవీ సమయంలో ఎన్టీఆర్‌ను చూశానని.. ఓ సారి ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారని రజినీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేశానని.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా(Tiger movie) చేశానని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని రజినీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక, నా అనుభవం చెబుతోంది.. ఈ వేదికపై రాజకీయం మాట్లాడొద్దని.. నేను రాజకీయం గురించి మాట్లాడితే ఏమేమో రాసేస్తారు అని రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.