వరసగా రెండు, మూడు రోజులు సెలవలు వచ్చినా, పిల్లలకు సమ్మర్ హాలీడేస్ వచ్చినా ఊళ్లకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. ఎక్కువ మంది మన దేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాలు చుట్టి రావాలని నుకుంటారు. అలాంటి వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇండియన్ రైల్వేస్కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజ్ ని తీసుకువచ్చింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించడంతో తక్కువ ధరలోనే తొమ్మిది రోజుల పాటు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.
పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ను అందిస్తోంది. ఈ ప్యాకేజీ మే 13న మొదలు కానున్నది. ఈ టూర్ లో భాగంగా వారణాసి, అయోధ్య, ప్రయాగ , పూరి, కోణార్క్ టెంపుల్ వంటి క్షేత్రాలను సందర్శించవచ్చు. కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీ కేటగిరిలను అందుబాటులో ఉంచగా.. పర్యాటకులు ఎంచుకున్న మేరకు ధరలు అందుబాటులో ఉండనున్నాయి.
ఎకానమీ కేటగిరిలో ఒక్కొక్కరు రూ.16,625 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే ఒక్కొక్కరు రూ.15,120 చెల్లిస్తే సరిపోతుంది. ఇక 5-11 సంవత్సరాల వారికి రూ.14,511 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. స్టాండర్డ్ కేటగిరిలో ఒక్కరికి రూ.25,770, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరు రూ.23,995, పిల్లలకు రూ.23815.. కంఫర్ట్ కేటగిరిలో ఒకరికి రూ.34,010, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి రూ.31,435, పిల్లలకు రూ.30,015 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పర్యటన సమయంలో ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి అందిస్తోంది. పర్యటనలో భాగంగా ఓడిశాలోని పూరీ జగన్నాథుడు, కోణార్క్ సూర్య దేవాలయం, బీచ్, విష్ణు గయ, కాశీ విశ్వనాథ్, గంగా హారతి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి పుణ్యక్షేత్రాలను, ఆ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శించవచ్చు.