తిరుమల తిరుపతి దేవస్థానంలో నయా దందా బయటపడింది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉన్న విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలంటే రూ.300 చెల్లించాలి. దాన్ని సుపథం ఎంట్రీ అంటారు. దాని కోసం ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ.. రూ.300 విలువైన టికెట్లను అక్రమంగా ఎక్కువ ధరకు అమ్ముకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. అందులో టీటీడీ ఉద్యోగి కూడా ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు, దళారి, టీటీడీ ఉద్యోగి కలిసి ఈ దందాను చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్, విజయవాడకు చెందిన కొందరు భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 ధర గల 7 టికెట్లను రూ.20,000 కు విక్రయించారు. దీనికి సంబంధించి విజిలెన్స్ వింగ్ అధికారులకు పక్కా సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డు నాగభూషణం, దళారి నాగరాజు అడ్డంగా దొరికిపోయారు. టీటీడీ ఉద్యోగి తిరుపతి పరారీలో ఉన్నాడు.