Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్లే అలిపిరి మెట్ల మార్గం((Alipiri Walkway) దగ్గర చిరుతపులి సంచారాన్ని టీటీడీ అధికారులు మరోసారి గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరోసారి చిరుత కదలికలు రికార్డు అయ్యాయి. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరిస్తున్నట్లు వారు గుర్తించారు.
ట్రాప్ కెమేరాలో చిరుతపులి కదలికలు రికార్డు కావడంతో టీటీడీ(ttd) అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అక్కడి భద్రతా సిబ్బందిని సైతం అప్రమత్తం చేశారు. అటవీ సిబ్బందికీ సమాచారం ఇచ్చారు. అక్కడ తిరుగాడుతున్న చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.
గత ఏడాది చిరుత పులి(Leopard) ఓ చిన్నారిని బలితీసుకున్న తర్వాత అక్కడ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ అడపాదడపా ఇలా చిరుత పులి, ఎలుగుబంటి లాంటి క్రూర మృగాల సంచారం వెలుగులోకి వస్తూనే ఉంది. ట్రాక్ కెమేరాల్లోనూ రికార్డు అవుతోంది. ఈ విషయమై శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ఆలోచన చేయాలని భక్తులు కోరుతున్నారు.